Mancherial: బియ్యం ధరలపై అధికారుల నిఘా మంచిర్యాల DSO వేణుగోపాల్!

Mancherial: మంచిర్యాలలో బియ్యం దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్. అధిక ధరలకు విక్రయిస్తే నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం చర్యలని హెచ్చరిక.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 1 Nov 2026 8:00 AM IST
Mancherial
X

Mancherial: బియ్యం ధరలపై అధికారుల నిఘా మంచిర్యాల DSO వేణుగోపాల్!

Mancherial: బియ్యం విక్రయాల్లో అధిక ధరలకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకే బియ్యం విక్రయించాలని, ప్రతి దుకాణంలో వివిధ రకాల బియ్యం ధరలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్ వ్యాపారులకు సూచించారు.

ఈ మేరకు శనివారం మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ఉన్న శ్రీనాథ్ ట్రేడర్స్, హరి ఓం ట్రేడర్స్, మహేశ్వరి ట్రేడర్స్ బియ్యం విక్రయ కేంద్రాలను డీటీ, ఆర్‌ఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో బియ్యం విక్రయాలు, ధరల వివరాలను పరిశీలించారు.

పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బియ్యం విక్రయ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు, ధరల పట్టికలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వేణుగోపాల్ స్పష్టం చేశారు. బీపీటీ బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా / హెచ్‌ఎంటీ బియ్యం రూ.74, జైశ్రీరామ్ బియ్యం రూ.79కు మించి విక్రయించరాదని తెలిపారు.

హోల్‌సేల్ వ్యాపారులు, కిరాణా దుకాణదారులు, మిల్లర్లు, బియ్యం విక్రయదారులందరూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. వినియోగదారులకు ధరల విషయంలో ఎలాంటి అయోమయం లేకుండా ప్రతి విక్రయ కేంద్రంలో ధరల వివరాలను అందరికీ కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు!

ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలను ఉల్లంఘించి అధిక ధరలకు బియ్యం విక్రయించే వ్యాపారులపై నిత్యావసర వస్తువుల చట్టం–1955 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి హెచ్చరించారు. వినియోగదారులు కూడా బియ్యం కొనుగోలు సమయంలో నిర్ణీత ధరలను గమనించాలని సూచించారు. ఈ తనిఖీల్లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.