Mancherial: సమైక్యతతో పండుగలు జరుపుకోవాలి.. మంత్రి గడ్డం వివేకానంద!

Mancherial: క్యాతనపల్లి రామకృష్ణాపూర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి గడ్డం వివేకానంద. కులమతాలకు అతీతంగా సమైక్యతతో పండుగలు జరుపుకోవాలని పిలుపు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 19 Oct 2026 6:45 AM IST
Mancherial
X

Mancherial: సమైక్యతతో పండుగలు జరుపుకోవాలి.. మంత్రి గడ్డం వివేకానంద!

Mancherial: కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యతతో పండుగలను సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్‌లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సింగరేణి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ తదితరులతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేక గుర్తింపునిస్తుందని తెలిపారు. జిల్లాలో దుర్గాపూజ, బతుకమ్మ వేడుకలను ప్రజలందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ఈ పండుగలు ప్రజల మధ్య శాంతి, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

రామకృష్ణాపూర్‌లో నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్‌తో పాటు సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించినట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద రూ.40 కోట్లతో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సింగరేణి సంస్థ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, కార్మికుల శ్రమతో అభివృద్ధి చెందుతున్న సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మంత్రి అన్నారు. గత పదేళ్లలో కొత్త గని ఏర్పాటు కాలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ అనుమతులు సాధించి కొత్త గనిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతాంగానికి మేలు జరిగేలా సమృద్ధిగా వర్షాలు కురవాలని దుర్గామాతను ప్రార్థించినట్లు తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ తాగునీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజలందరూ శాంతి, సామరస్యాలతో పండుగలను జరుపుకోవాలని కోరారు. జిల్లాలో అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలు ఐక్యంగా దుర్గాపూజ, బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఆనందదాయకమన్నారు.

అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంత్రి తన సతీమణి సరోజ, జిల్లా కలెక్టర్‌తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.