Mancherial: మంచిర్యాలలో శాంతిభద్రతలు కాపాడాలి: బీజేపీ నేతలు!

Mancherial: మంచిర్యాల జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాలని, కాంగ్రెస్ అంతర్గత గ్రూపు తగాదాలపై విచారణ జరపాలని కోరుతూ కాళేశ్వరం జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డికి బీజేపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 24 Oct 2026 9:28 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో శాంతిభద్రతలు కాపాడాలి: బీజేపీ నేతలు!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించాలని, ఇటీవల చోటుచేసుకున్న గొడవలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కాళేశ్వరం జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ని కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ ఐజీని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు, పరస్పర గొడవల కారణంగా జిల్లాలో ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని ఆరోపించారు. రాజకీయ విభేదాలు వీధి గొడవలకు దారితీయకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పలు ఘటనలపై విచారణ జరపాలి

బతుకమ్మ పండుగ రోజున దండేపల్లి మండలం తాళ్లపేటలో జరిగిన గొడవ, దసరా రోజున లింగాపూర్‌లో చోటుచేసుకున్న ఘటన, లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో జరిగిన అల్లర్లపై ఐజీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనల వెనుక ఉన్న కారణాలను నిష్పక్షపాతంగా విచారించి, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే మంచిర్యాల జిల్లాలో పోలీసుల పహారా, భద్రతా చర్యల తీరుపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో భయాందోళనలు తొలగించి, సాధారణ జనజీవనం సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రాజకీయాలకు అతీతంగా శాంతిభద్రతలను కాపాడాలని బీజేపీ నాయకులు ఐజీకి విజ్ఞప్తి చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.