Mancherial: కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్: ఎంపీ వంశీకృష్ణ హెచ్చరిక
Mancherial: మంచిర్యాల జిల్లా తాళ్లపేటలో పర్యటించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అని, తాను, మంత్రి వివేక్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Mancherial: కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్: ఎంపీ వంశీకృష్ణ హెచ్చరిక
మంచిర్యాల: కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించినా, వారిపై అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రతి కార్యకర్తకు తాను, మంత్రి వివేక్ వెంకటస్వామి అండగా ఉంటామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఏ చిన్న అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, వారి కోసం ఎంతవరకైనా పోరాడతానని హెచ్చరించారు.
శుక్రవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఎంపీ వంశీకృష్ణ పర్యటించారు. ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో స్థానిక సర్పంచ్ కుర్సింగ కళావతి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఘాటుగా స్పందించారు.
కాకా గారి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లు, పోరాటాలను ఎదుర్కొందని, లాఠీ దెబ్బలకు, తుపాకీ తూటాలకు సైతం వెనుకాడని చరిత్ర కాంగ్రెస్ కార్యకర్తలదని వంశీకృష్ణ గుర్తుచేశారు. అలాంటి కార్యకర్తలను బెదిరిస్తే భయపడతారని భావించడం పొరపాటన్నారు. కార్యకర్తల జోలికి రావాలంటే ముందుగా తనను దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
అక్రమ కేసులు పెట్టినా, బెదిరింపులకు దిగినా ఏ ఒక్క కార్యకర్తను ఒంటరిగా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎంపీ వంశీకృష్ణ వెంట సీనియర్ కాంగ్రెస్ నేత మంథని జగన్మోహన్ కూడా ఉన్నారు.




