Bellampalli: బెల్లంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. కాంగ్రెస్ నేతపై కేసు!
Bellampalli: బెల్లంపల్లి మండలం కన్నాలలో ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం రెవెన్యూ బోర్డు తొలగించిన కాంగ్రెస్ నేత నాథరి స్వామిపై కేసు నమోదు.. కబ్జాదారులను ఉపేక్షించబోమన్న ఎమ్మెల్యే.
Bellampalli: బెల్లంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. కాంగ్రెస్ నేతపై కేసు!
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాథరి స్వామి ప్రభుత్వ భూమిని ఆక్రమించే ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును అర్థరాత్రి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి.
కన్నాల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 60/1లోని ప్రభుత్వ భూమిని రక్షించేందుకు అధికారులు గతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్డును నాథరి స్వామి తొలగించినట్లు స్థానికుడు గొగర్ల రాజేశం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో గ్రామ పాలనాధికారి, గిర్దావర్-II క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి స్థానికుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. ప్రభుత్వ భూమికి సంబంధించిన బోర్డును ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు నిర్ధారణకు వచ్చిన రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. పార్టీలు, రాజకీయ సంబంధాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బెల్లంపల్లి తహశీల్దార్ లవుడ్య కృష్ణ ఫిర్యాదు మేరకు తాళ్లగురిజాల పోలీసులు నాథరి స్వామిపై BNS సెక్షన్లు 324(4), 329(3) కింద క్రైమ్ నంబర్ 146/2026తో కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ భూముల జోలికి వస్తే ఉపేక్షించేది లేదన్న సంకేతాలను ఈ ఘటన ద్వారా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ఇచ్చింది.




