Komaram Bheem: ఆసిఫాబాద్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు!

Komaram Bheem: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 17 Sept 2026 3:27 PM IST
Komaram Bheem
X

Komaram Bheem: ఆసిఫాబాద్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు!

Komaram Bheem: ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బండ ప్రకాష్ మాట్లాడుతూ నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఆసిఫాబాద్ ప్రాంత సమరయోధుల త్యాగాలు మరువలేనివని అన్నారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కొమురం భీం త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 2 కోట్ల 41 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, తద్వారా రూ.88.05 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని చెప్పారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా జిల్లాలో 78,467 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, సబ్సిడీ రూపంలో మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.8.32 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. విద్యా రంగంలోనూ పలు సంస్కరణలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు కొత్తగా 163 రకాల వ్యాధులకు చికిత్సను చేర్చినట్లు బండ ప్రకాష్ తెలిపారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సల కోసం ఇప్పటివరకు రూ.21.99 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాబోయే రోజుల్లోనూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని బండ ప్రకాష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.