Asifabad: జంగుభాయి ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
Asifabad: జంగుభాయి దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఆశ్రమ పాఠశాలల్లో గిరి ఇండస్ట్రీస్ ఉత్పత్తులు అందించాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క కోరారు.
Asifabad: జంగుభాయి ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
కొమురం భీమ్ ఆసిఫాబాద్: జంగుభాయి దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి, ఆలయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క కోరారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో తయారవుతున్న గిరి ఇండస్ట్రీస్ ఉత్పత్తులను గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ బీఎన్ సంతోష్‌ను ఆయన కార్యాలయంలో ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో పలువురు ఆదివాసీ పెద్దలు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జంగుభాయి దేవాలయాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి, ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
అదేవిధంగా గిరి ఇండస్ట్రీస్‌లో తయారవుతున్న చిక్కీలు, సబ్బులు, షాంపూలను కొనుగోలు చేసి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించాలని కోరారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో తయారవుతున్న ఉత్పత్తులకు మార్కెట్ ప్రోత్సాహం లభించడంతో పాటు, స్థానిక పరిశ్రమలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. విద్యార్థులకు కూడా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
వారి విజ్ఞప్తులపై కమిషనర్ బీఎన్ సంతోష్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అంశాలను పరిశీలించి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ మేడి మెస్రం దుర్గు, పురుక బాపూరావు, సలాం శ్యామ్ రావు, గిరి ఇండస్ట్రీస్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.




