Asifabad: స్కూళ్ల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం
Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పాఠశాలల సమీపంలో మత్తు పదార్థాలు, పొగాకు విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేసి 31 కేసులు నమోదు చేశారు.
Asifabad: స్కూళ్ల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం
ఆసిఫాబాద్: చదువుల ఆలయాలైన పాఠశాలల పరిసరాల్లో మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు కఠిన చర్యలకు దిగారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల సమీపంలోని కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, ఇతర వ్యాపార కేంద్రాలపై జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం, గుట్కా, సిగరెట్లు విక్రయిస్తున్న వారిపై కొరడా ఝళిపించారు. ఈ తనిఖీల్లో మొత్తం 31 కేసులు నమోదు చేసి, 3.24 లీటర్ల ఐఎంఎఫ్ఎల్ మద్యంతో పాటు వివిధ రకాల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా పాఠశాలల 100 మీటర్ల పరిధిలోని దుకాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్సైజ్ చట్టం, సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పాఠశాలల పరిసరాల్లో మద్యం, గుట్కా, సిగరెట్లు వంటి ఉత్పత్తులను విక్రయించవద్దని దుకాణదారులకు పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే ఇలాంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాఠశాలల పరిసరాలను మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఎస్పీ నితికా పంత్ పేర్కొన్నారు. పాఠశాలల సమీపంలో అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని లేదా డయల్ 112కు ఫోన్ చేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఈ తనిఖీల్లో జిల్లా పోలీస్ అధికారులు, పోలీస్ స్టేషన్ల సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.




