Asifabad: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు!
Asifabad: ఆసిఫాబాద్ అడా ప్రాజెక్టు వద్ద బతుకమ్మ వేడుకల్లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ హరిత పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని కొనియాడారు.
Asifabad: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు!
కొమురం భీం ఆసిఫాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఆసిఫాబాద్ మండలంలోని అడా ప్రాజెక్టు వద్ద నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో పండుగ జరుపుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం మహిళల ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల జీవితాల్లో సంతోషం, నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని భావితరాలకు అందించేందుకు ఇలాంటి పండుగలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మరమట్, ఎం. డేవిడ్, డిప్యూటీ కలెక్టర్ జోయల్ జస్వింత్, డీఆర్డీఓ దత్తారావు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ తదితరులు పాల్గొన్నారు.




