Asifabad: రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి సీపీఎం జాన్ వెస్లీ

Asifabad: తెలంగాణను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలని సీపీఎం జాన్ వెస్లీ డిమాండ్. ఉపాధి కూలీలకు 200 రోజుల పని, ₹800 కూలి ఇవ్వాలని విజ్ఞప్తి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 29 Oct 2026 4:38 PM IST
Asifabad
X

Asifabad: రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి సీపీఎం జాన్ వెస్లీ

ఆసిఫాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి కుశాన రాజన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడారు. కరువు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతు భరోసా పథకం కింద అందించే సాయాన్ని రెట్టింపు చేయాలని, వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులకు తగిన ఆర్థిక భరోసా కల్పించాలని సూచించారు.

ఉపాధి కూలీలకు 200 రోజుల పని కల్పించాలి

ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.800 వేతనం చెల్లించాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సహాయక నిధులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు.

గిరిజనులపై దాడులు ఆపాలి

గిరిజనులపై అటవీ అధికారుల దాడులను నిలిపివేయాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సీపీఎం నాయకులు బండారి రవికుమార్, భూపాల్, దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, టీకానంద్ తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.