Asifabad: విధుల పట్ల నిర్లక్ష్యం.. ఇద్దరు హెచ్‌ఎంలపై కలెక్టర్ వేటు

Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం సేవించి స్కూల్‌కు వచ్చిన హెచ్‌ఎం సస్పెన్షన్. సమావేశం మధ్యలో వెళ్లిన మరో హెచ్‌ఎంపై చర్యలకు కలెక్టర్ హరిత ఆదేశాలు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 10 Nov 2026 10:17 PM IST
Asifabad
X

Asifabad: విధుల పట్ల నిర్లక్ష్యం.. ఇద్దరు హెచ్‌ఎంలపై కలెక్టర్ వేటు

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్ కె. హరిత స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఉపాధ్యాయులే విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై చర్యలకు ఉపక్రమించారు.

తిర్యాణి మండలంలోని పీఎం శ్రీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంబరం శ్రీనివాస్ మద్యం సేవించి పాఠశాలకు వచ్చినట్లు గుర్తించారు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు.

మరోవైపు సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవి వ్యవహారంపైనా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు సంబంధించిన అధికారిక సమావేశానికి హాజరైన ఆయన, సమావేశం పూర్తికాకముందే మధ్యలో వెళ్లిపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంపై ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేసే ప్రతి అధికారి, ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో బాధ్యత, నిబద్ధత, క్రమశిక్షణ పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను ఈ ఘటనల ద్వారా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాధ్యతారాహిత్యానికి తావులేదని కలెక్టర్ చర్యలు స్పష్టం చేశారు..

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.