Asifabad: క్షయ రహిత గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దాలి
Asifabad: ఆసిఫాబాద్ జిల్లాను క్షయ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కె. హరిత పిలుపు. కెరమెరి కొలాంగూడలో వైద్య శిబిరం ప్రారంభం, జన్‌మన్ ఇళ్లపై స్పందన.
Asifabad: క్షయ రహిత గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దాలి
కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లాలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించి, గిరిజన గ్రామాలను క్షయ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు. క్షయ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు.
కెరమెరి మండలం దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమగ్ర ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేంద్రతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రజలు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స పొందకపోతే ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
క్షయ వ్యాధి నిర్ధారణ అయినవారు వైద్యుల సూచనల ప్రకారం ఆరు నెలల పాటు మందులు క్రమం తప్పకుండా వాడాలని, పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. వ్యాధి నిర్మూలనపై గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల మంజూరు
ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద అర్హులైన గిరిజన కుటుంబాలకు ఇళ్ల మంజూరు విషయంలో సమస్యలను గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్ణీత విస్తీర్ణంలో, నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
పాఠశాలను సందర్శించిన కలెక్టర్
అనంతరం గ్రామంలోని టీడబ్ల్యూపీఎస్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థుల హాజరు వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారికి చాక్లెట్లు అందించారు.
అంతకుముందు క్షయ వ్యాధి నిర్మూలన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాల ద్వారా ప్రజలకు వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు, చికిత్సపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా నుంచి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, గిరిజన గ్రామాలను క్షయ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.




