Mancherial: బాల్య వివాహాల రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలి!

Mancherial: బాల్య వివాహాల రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య పిలుపునిచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Updated on: 28 Nov 2026 11:29 AM IST
Mancherial
X

Mancherial: బాల్య వివాహాల రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలి!

Mancherial: బాల్య వివాహాల రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తు, విద్య, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, వాటి నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని అన్నారు.

శుక్రవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో డ్రీమ్ సొసైటీ ఆధ్వర్యంలో, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సౌజన్యంతో బాల్య వివాహాల నిరోధంపై రూపొందించిన ప్రచార రథాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండేతో కలిసి అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలకు తావులేకుండా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలు నిర్వహించడం, వాటికి సహకరించడం లేదా మద్దతు ఇవ్వడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

బాల్య వివాహ నిరోధక చట్టం-2006 ప్రకారం నేరానికి పాల్పడిన వారికి రూ.లక్ష వరకు జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు డ్రీమ్ సొసైటీ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు.

అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బాల్య వివాహాల నిరోధానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సంక్షేమ, కార్మిక, వైద్య ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, పోషణ అభియాన్, చైల్డ్ హెల్ప్‌లైన్, బాలల పరిరక్షణ, మహిళా సాధికారత శాఖల ప్రతినిధులు, డ్రీమ్ సొసైటీ ప్రతినిధి సంతోష్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు, సమన్వయకర్తలు సుజాత, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.