Mancherial: భీమారంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య విస్తృత తనిఖీలు!
Mancherial: మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో అభివృద్ధి పనులు, పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య. అధికారులకు కీలక ఆదేశాలు.
Mancherial: భీమారంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య విస్తృత తనిఖీలు!
మంచిర్యాల: జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అధికారులను ఆదేశించారు.
శుక్రవారం భీమారం మండలంలోని భీమారం, భూరుగుపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రం, పంట కుంటలు, వర్షపు నీటి సంరక్షణ పనులు, గ్రామ పంచాయతీ రికార్డులు, ఇంకుడు గుంతలు, సమీకృత ఎస్సీ, బీసీ వసతి గృహాలను ఆయన సందర్శించి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, అభ్యాసనంలో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధన అందించడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు కల్పించాలని తెలిపారు.
భీమారం గ్రామంలో పంట కుంటల పనులను పరిశీలించిన ఆయన.. వ్యవసాయ అవసరాలకు వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. భూరుగుపల్లి గ్రామ పంచాయతీలో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణ పనులను ప్రారంభించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భూరుగుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం వహించకుండా, పనుల పురోగతి, రికార్డుల నిర్వహణలో పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో మురుగునీటి నిర్వహణను మెరుగుపరిచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
అనంతరం భీమారం మండల కేంద్రంలోని సమీకృత ఎస్సీ, బీసీ వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాల నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీణ, మండల విద్యాధికారి శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సతీష్, ఏపీఓ, సంబంధిత గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




