Ramagundam: 76 కేసుల్లో 112 మందికి శిక్షలు: రామగుండం సీపీ వెల్లడి!

Ramagundam: రామగుండం కమిషనరేట్ పరిధిలో 2026లో 76 కేసుల్లో 112 మందికి శిక్షలు, 8 కేసుల్లో జీవిత ఖైదు పడినట్లు శుక్రవారం సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 20 Nov 2026 4:26 PM IST
Ramagundam
X

Ramagundam: 76 కేసుల్లో 112 మందికి శిక్షలు: రామగుండం సీపీ వెల్లడి!

Ramagundam: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరస్తులకు శిక్షలు పడేలా పోలీసులు పటిష్ట దర్యాప్తు చేపట్టి, కోర్టుల్లో నేరాలను నిరూపించడంలో కీలక ఫలితాలు సాధించారు. 2026 సంవత్సరంలో 76 కాంటెస్టెడ్ కన్విక్షన్ కేసుల్లో 112 మంది నిందితులకు న్యాయస్థానాలు శిక్షలు విధించాయి. బాధితులకు న్యాయం చేయడంతో పాటు నేరస్తులకు చట్టపరమైన శిక్ష పడేలా పోలీస్, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేశాయని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.

ఈ కేసుల్లో 8 కేసులకు సంబంధించి 8 మందికి జీవిత ఖైదు విధించగా, మరో 2 కేసుల్లో ఐదుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఒక కేసులో నిందితుడికి 12 సంవత్సరాలు, 9 కేసుల్లో 10 మందికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. మరో కేసులో ఒకరికి ఏడేళ్ల శిక్ష, 5 కేసుల్లో ఏడుగురికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. మరో 39 కేసుల్లో 49 మందికి నాలుగేళ్లలోపు జైలు శిక్షలు విధించగా, 11 కేసుల్లో 31 మందికి జైలు శిక్షకు బదులుగా జరిమానాలు విధించారు. అన్ని కేసుల్లో కలిపి న్యాయస్థానాలు రూ.7,44,500 జరిమానా విధించాయి.

నేరం చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేయడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు పూర్తయ్యే వరకు, శాస్త్రీయ ఆధారాల సేకరణ, సాక్ష్యాల సమర్పణ, న్యాయస్థానాల్లో నేర నిరూపణ వరకు ప్రతి దశలోనూ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నిందితులకు శిక్షలు పడినప్పుడు బాధితులకు న్యాయం జరగడమే కాకుండా, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.

మహిళలు, చిన్నారులపై నేరాలు, హత్యలు, పోక్సో, ఇతర తీవ్రమైన నేరాల్లో ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు శిక్షలు పడేలా పకడ్బందీగా ఆధారాలు సమర్పించాలని అధికారులకు సూచించారు. పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేసిన అధికారుల సేవలను అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో బాధితులకు న్యాయం జరిగేలా పనిచేయాలని సీపీ పిలుపునిచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.