Nagarkurnool: సకాలంలో చికిత్సతోనే పాముకాటు నుంచి రక్షణ: డాక్టర్ ప్రియాంక!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో వరల్డ్ స్నేక్ బైట్ అవేర్‌నెస్ డే. సకాలంలో వైద్యం అందిస్తే పాముకాటు బాధితులను కాపాడవచ్చని డాక్టర్ ప్రియాంక వెల్లడి.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 19 Sept 2026 7:16 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: సకాలంలో చికిత్సతోనే పాముకాటు నుంచి రక్షణ: డాక్టర్ ప్రియాంక!

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో వరల్డ్ స్నేక్ బైట్ అవేర్‌నెస్ డే సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు పాము కాటు నివారణ, తక్షణ వైద్యం, పాముల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్ ఆధ్వర్యంలో జంతు శాస్త్ర విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రియాంక, ఇంటర్నేషనల్ స్నేక్ కన్జర్వేషన్ సొసైటీ స్నేక్ క్యాచర్ వంశీ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అవగాహన లేకపోవడం, వైద్యం అందడంలో ఆలస్యం కారణంగా ప్రాణనష్టం జరుగుతోందన్నారు. పాము కరిచిన వెంటనే భయాందోళనకు గురికాకుండా బాధితుడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు. మంత్రగాళ్లను ఆశ్రయించడం, మూఢనమ్మకాలను నమ్మడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. విషపూరిత పాము కాటుకు గురైనప్పుడు వైద్యం ఆలస్యం చేయడం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

స్నేక్ క్యాచర్ వంశీ మాట్లాడుతూ పాములు కనిపించినప్పుడు వాటిని చంపకుండా సురక్షితంగా దూరంగా ఉండాలని సూచించారు. పాములు పంట పొలాల్లో ఎలుకలు, ఇతర చిన్న జీవుల సంఖ్యను నియంత్రించడం ద్వారా రైతులకు, పంటలకు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఇళ్లలోకి పాములు వచ్చినప్పుడు వాటిని చంపకుండా స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని సూచించారు. స్నేక్ క్యాచర్లు వాటిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలేస్తారని తెలిపారు.

కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ ఎం. అంజయ్య, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వనిత, ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ ఉమాదేవి, కోదండరాములు, నరేష్, రామకృష్ణ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL