Nagarkurnool: ఇంటర్ విద్య రద్దు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి: AISF
Nagarkurnool: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్య రద్దు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ఏఐఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు బలముల ప్రేమ్ కుమార్ హెచ్చరించారు.
Nagarkurnool: ఇంటర్ విద్య రద్దు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి: AISF
నాగర్కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బలముల ప్రేమ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ వంటి విభిన్న కోర్సులను ఎంచుకొని ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు. అలాంటి కీలకమైన విద్యా దశను రద్దు చేయాలనే ఆలోచన విద్యార్థుల విద్యా ప్రగతికి ఆటంకంగా మారే ప్రమాదం ఉందన్నారు.
ఇంటర్మీడియట్ విద్య అనేది కేవలం పాఠశాల విద్యకు, ఉన్నత విద్యకు మధ్య ఉండే వారధి మాత్రమే కాదని, విద్యార్థుల్లో ప్రత్యేకమైన విజ్ఞానం, విషయ పరిజ్ఞానం, పోటీ పరీక్షలకు అవసరమైన పునాది, ఉన్నత విద్యకు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించే కీలకమైన విద్యా దశ అని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థను రద్దు చేయడం వల్ల విద్యార్థులు, అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ఇష్టానుసారంగా మార్పులు చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలంటే ముందుగా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని, విద్యావేత్తలు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులతో విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని సూచించారు, ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధమని అన్నారు.
ప్రభుత్వం నిజంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేయడం కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, సరిపడా తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన సమయంలో వాటి ప్రత్యేకతను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వ విద్యారంగంపై ప్రజల్లో నమ్మకం తగ్గే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులను సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని బలముల ప్రేమ్ కుమార్ హెచ్చరించారు.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వ బాధ్యత.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే ఏఐఎస్ఎఫ్ చూస్తూ ఊరుకోదు!




