Kalwakurthy: యాదవుల అభ్యున్నతికి కృషి: జక్కుల చిన్న జంగయ్య

Kalwakurthy: అఖిల భారత యాదవ మహాసభ కల్వకుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం కొలువుదీరింది.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 7 Nov 2026 7:06 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: యాదవుల అభ్యున్నతికి కృషి: జక్కుల చిన్న జంగయ్య

నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం: యాదవల అభ్యున్నతికి, విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అఖిల భారత యాదవ మహాసభ కల్వకుర్తి నియోజకవర్గ నూతన అధ్యక్షులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ అన్నారు.శనివారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కమిటీ సభ్యులు, అడ్వకేట్ రవీందర్ యాదవ్, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు లాలు యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు వావిళ్ల సంజీవ్ యాదవ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జక్కుల చిన్న జంగయ్య యాదవ్‌ను నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్ మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గంలో విద్యా చైతన్యం పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానన్నారు. విద్యకు దూరంగా ఉండటం వల్ల అనేక కుటుంబాలు అభివృద్ధిలో వెనుకబడుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యాదవ కుటుంబాలు తమ పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డంకిగా మారకుండా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు అవసరమైన సహకారం అందించే దిశగా సంఘం కృషి చేయాలన్నారు.

సమాజంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, న్యాయ సహాయం అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. మహిళలు విద్యావంతులై ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో ముందుకు సాగినప్పుడే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలను చైతన్యపరిచి రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో వారికి సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

యాదవ సామాజిక వర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, స్వయం ఉపాధి రంగాలపై అవగాహన కల్పించేందుకు సంఘం తరఫున కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం, సేవాభావం పెంపొందించుకోవాలని, వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా అందరూ ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు.

తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తన పదవిని వ్యక్తిగత హోదాగా కాకుండా సామాజిక సేవకు లభించిన బాధ్యతగా భావించి పనిచేస్తానని, యాదవుల సమస్యల పరిష్కారానికి నాయకులతో కలిసి నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

అఖిల భారత యాదవ మహాసభ కల్వకుర్తి నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఇడమోని తిరుపతయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా నకినమోని వెంకట యాదవ్, ఈ. సురేష్ యాదవ్, కార్యదర్శిగా గోసుల అమర్ యాదవ్, ఎన్నికయ్యారు. సలహాదారులుగా రుక్కయ్య యాదవ్, నకినమోని పెద్దయ్య యాదవ్‌లను నియమించగా, మరో ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గం యాదవుల ఐక్యత, విద్యాభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక చైతన్యం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ నాయకులు, కల్వకుర్తి మండల అధ్యక్షుడు లింగం తిరుపతయ్య, గౌరవ అధ్యక్షుడు నక్క శ్రీనివాస్, ఊరుకొండ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, వంగూరు మండల అధ్యక్షుడు పుల్లయ్య యాదవ్, చారకొండ అధ్యక్షుడు బిక్షపతి, వెల్దండ మండల అధ్యక్షుడు తనిష్ యాదవ్,సామాజిక వర్గ పెద్దలు యువకులు మల్లేష్ యాదవ్, సంజీవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY