Makthal: మక్తల్ అభివృద్ధికి అడ్డుపడితే అడ్డంగా తొక్కుకుంటూ ముందుకు పోతా!

Makthal: మక్తల్ అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదని హెచ్చరించిన మంత్రి వాకిటి శ్రీహరి. రూ.3 కోట్ల వ్యయంతో పూర్తయిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవం.

B. NARENDER, MAKTHAL
Published on: 7 Nov 2026 11:21 AM IST
Makthal
X

Makthal: మక్తల్ అభివృద్ధికి అడ్డుపడితే అడ్డంగా తొక్కుకుంటూ ముందుకు పోతా!

Makthal: అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా వెనక్కి తగ్గేది లేదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని రాష్ట్ర క్రీడా , పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

మక్తల్ పట్టణంలోని 7వ వార్డులో గుర్లపల్లి వరకు 3 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం అభివృద్ధి పనులు చేస్తున్నానని తెలిపారు.

తనను విమర్శించే వారికి ఒక్కటే సూచన చేస్తున్నానని, పని చేసే వారిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేయవద్దని, వ్యక్తులను మానసికంగా వేధించవద్దని హితవు పలికారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అంతకంటే వేగంగా ముందుకు సాగుతానన్నారు.మక్తల్ అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

పట్టణ అభివృద్ధికి రూ.45 కోట్లు

మక్తల్ పట్టణ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.45 కోట్లు ఖర్చు చేశామని, నియోజకవర్గంలో సుమారు రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మక్తల్‌కు 200 కోట్ల అభివృద్ధి నిధులు కూడా రాని పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుత మూడేళ్లలో ప్రజల ఆశీస్సులతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లభించిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో రూ.550 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి పేరుతో కొబ్బరికాయలు కొట్టి వెళ్లారే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పనులు జరగలేదని విమర్శించారు. గతంలో రాష్ట్రంలో ఎక్కడో మరుగున పడిన మక్తల్ నేడు అభివృద్ధిలో అగ్రభాగాన నిలుస్తోందని అన్నారు.

పట్టణంలోని ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కౌన్సిలర్లు పోటీపడుతున్నారని, ఇది ప్రజల్లో పెరిగిన అభివృద్ధి ఆకాంక్షకు నిదర్శనమని పేర్కొన్నారు.

అసత్య ఆరోపణలు మానుకోవాలి

నియోజకవర్గంలోని సహజ వనరులను అమ్ముకుంటున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి ఖండించారు. పేదలు నిర్మించుకునే ఇళ్లు, ప్రభుత్వ అభివృద్ధి పనుల అవసరాల కోసమే ఇసుకను వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్లోనూ సింహభాగం తెలంగాణ ప్రజలు చెల్లించే పన్నుల రూపంలోనే సమకూరుతోందనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలని సూచించారు.

మంత్రి అనే హోదాను పక్కనపెట్టి ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. మంచి ఎక్కడ జరిగినా గుర్తించాలని, అభివృద్ధిలోని లోపాలను నిర్మాణాత్మకంగా సూచించాలే తప్ప, చెడును వెతుకుతూ అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. మన రాతలు మనమే మార్చుకోవాలని...ఖామోషీ బహుత్ ఖతర్నాక్ హై అంటూ ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

మక్తల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మీడియా వేదికగా బహిరంగ చర్చకు తాను సిద్ధమని మంత్రి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మీరు లక్ష ప్రశ్నలు వేసినా ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అభివృద్ధి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ప్రతిపక్షాల విమర్శలకు వాస్తవాలతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

మక్తల్ పట్టణంలోని ప్రతి వార్డుకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, గ్రామీణ ప్రాంతాల్లోనూ రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

విమర్శలకు సమాధానం అభివృద్ధి పనులే.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తన లక్ష్యమని, మక్తల్‌ను అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించబోనని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస హన్మంతు, 7వ వార్డు కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య, మక్తల్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL