Wanaparthy: రంగాపురం గ్రామంలో తొమ్మిది ఇళ్లలో దొంగల హల్‌చల్!
Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో తొమ్మిది ఇళ్లలో దొంగల బీభత్సం. చిన్నచిన్న వస్తువులు అపహరణ, రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. గ్రామంలోని సుమారు తొమ్మిది ఇళ్లలో దొంగలు చొరబడి వస్తువులను చిందరవందర చేసినట్లు సమాచారం. అయితే ఇళ్లలోని చిన్నచిన్న వస్తువులు మినహా పెద్ద మొత్తంలో నగదు, విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు ప్రాథమికంగా తెలియరాలేదు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సిఐ ఓడి రమేష్, పెబ్బేరు ఎస్ఐ వెంకటేష్ గౌడ్ గ్రామానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో కలిసి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. దొంగతనాలకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
గ్రామంలో వరుసగా తొమ్మిది ఇళ్లలో దొంగలు ప్రవేశించడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది.ఈ సందర్భంగా సిఐ ఓడి రమేష్,ఎస్ఐ వెంకటేష్ గౌడ్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులు, నగదును భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.




