Wanaparthy: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి
Wanaparthy: వనపర్తిలో నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్లను కలెక్టర్ ఆదర్శ్ సురభి విడుదల చేశారు; యువత మత్తుకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఎదగాలని సూచించారు.
Wanaparthy: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: మత్తు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబానికి, సమాజానికి కూడా హానికరమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ద్వారా యువతలో మత్తు పదార్థాల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని, యువత తమ భవిష్యత్తును మత్తు పదార్థాలకు బానిస చేయకుండా విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని ఆయన పిలుపునిచ్చారు. మత్తు రహిత సమాజమే మన లక్ష్యం – నషా ముక్త్ భారత్ మనందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ల నమోదు కార్యక్రమంతో పాటు నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి గారు నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్లను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీ యాదయ్య గారు, డీవైఎస్ఓ శ్రీ సుధీర్ రెడ్డి గారు, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పోతుల అమరేందర్, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎల్లా భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు బాల లింగయ్య, మీషేక్, మధు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పోతుల అమరేందర్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండేందుకు అవగాహన సదస్సులు, కార్నర్ మీటింగ్ల ద్వారా వారిని చైతన్యవంతులను చేస్తామని తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్య సాధనకు రెడ్ క్రాస్ వాలంటీర్లు విస్తృతంగా కృషి చేస్తారని పేర్కొన్నారు..




