Uppununthala: అక్రమ భూ నమోదు: ఉప్పునుంతల తహసీల్దార్ సునీత సస్పెన్షన్

Uppununthala: అయ్యవారిపల్లి సర్వే నంబర్ 115 భూ రికార్డుల అవకతవకలపై అచ్చంపేట సబ్ కలెక్టర్ నివేదిక ఆధారంగా ఉప్పునుంతల తహసీల్దార్ ఎ. సునీతను కలెక్టర్ సస్పెండ్ చేశారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 31 Oct 2026 7:15 PM IST
Uppununthala
X

Uppununthala: అక్రమ భూ నమోదు: ఉప్పునుంతల తహసీల్దార్ సునీత సస్పెన్షన్

నాగర్‌కర్నూల్ జిల్లా: అచ్చంపేట డివిజన్, ఉప్పునుంతల మండలం, అయ్యవారిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 115లో భూ రికార్డుల నమోదుకు సంబంధించి జరిగినట్లు గుర్తించిన అవకతవకలు, సంబంధిత పత్రాల పరిశీలనలో విధుల నిర్వహణలో వైఫల్యంపై విచారణ నివేదిక ఆధారంగా తహసీల్దార్ శ్రీమతి ఎ. సునీతను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ హేమంత కేశవ్ పాటిల్, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అయ్యవారిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 115లో 13.17 గుంటల భూమి అక్రమంగా ఇతరుల పేర్లపై నమోదైనట్లు పలు వార్తా దినపత్రికలో ప్రచురితమైన వార్త నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని చాబ్రా ను విచారణ అధికారిగా నియమించగా, ఆమె సమగ్ర విచారణ నిర్వహించి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించారు.

విచారణలో భాగంగా పాత రెవెన్యూ రికార్డులు, పహాణీలు, ఖాస్రా, ఆర్‌ఓఆర్ రికార్డులు, భూ భారతి పోర్టల్‌లోని దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఎన్‌కంబరెన్స్ వివరాలు తదితర పత్రాలను పరిశీలించారు.

విచారణ నివేదిక ప్రకారం, సర్వే నంబర్ 115లో మొత్తం 18.17 గుంటల భూమి ఉన్నట్లు ఖాస్రా రికార్డుల్లో నమోదై ఉంది. 1971-72 నుంచి 1976-77 వరకు ఉన్న పాత పహాణీలు, ఐబీ రిజిస్టర్ ప్రకారం మొత్తం భూమి ద్యాప రామిరెడ్డి పేరుపై నమోదై ఉన్నట్లు గుర్తించారు.

నూతన ఆర్‌ఓఆర్ రికార్డుల ప్రకారం 13 ఎకరాల 17 గుంటలు సర్వే నంబర్ 115/Aలో ద్యాప రామిరెడ్డి పేరుపై, మిగిలిన 5 ఎకరాలు సర్వే నంబర్ 115/AAలో పి. యాదమ్మ పేరుపై నమోదై ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.

భూ భారతి పోర్టల్ ద్వారా దాఖలైన పేర్ల మార్పు, సర్వే నంబర్ ఉపవిభాగాల నమోదుకు సంబంధించిన దరఖాస్తులు, వాటికి జతచేసిన పత్రాలు, డిజిటల్ సంతకాల ప్రక్రియను కూడా విచారణలో పరిశీలించారు. కొన్ని నమోదులు అసలు రెవెన్యూ రికార్డులతో సరిపోలడం లేదని, సంబంధిత పత్రాల ధృవీకరణలో లోపాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, అప్పట్లో చారకొండ తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం డిప్యుటేషన్‌పై ఉప్పునుంతల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ. సునీత, తనకు అప్పగించిన చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనట్లు విచారణ నివేదికలో పేర్కొనడంతో ఆమెపై సస్పెన్షన్ చర్యలు చేపట్టారు.

తెలంగాణ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్, 1991లోని రూల్ 8(1)(a) ప్రకారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుంది.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA