Nagarkurnool: ఘనంగా ముగిసిన తెలుగు భాషా–సాంస్కృతిక ఉత్సవాలు
Nagarkurnool: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారం రోజుల తెలుగు భాషా–సాంస్కృతిక ఉత్సవాల ముగింపు సభలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పాల్గొన్నారు.
Nagarkurnool: ఘనంగా ముగిసిన తెలుగు భాషా–సాంస్కృతిక ఉత్సవాలు
నాగర్‌కర్నూల్: విద్యార్థులు కేవలం డిగ్రీ సాధించడంపైనే దృష్టి పెట్టకుండా భవిష్యత్ పోటీని ఎదుర్కొనేలా నైపుణ్యాలు, విస్తృత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సూచించారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వారం రోజుల తెలుగు భాషా–సంస్కృతి కార్యక్రమాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అకాడమిక్ విద్యతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి సంవత్సరం వేలాది మంది డిగ్రీలు పూర్తి చేస్తున్న నేపథ్యంలో కేవలం డిగ్రీ పట్టా ఉద్యోగ మార్కెట్‌లో పోటీని ఎదుర్కొనేందుకు సరిపోదన్నారు. విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ రంగాల్లో అవకాశాలను అన్వేషించాలని సూచించారు.
కళాశాల విద్య పూర్తయ్యేలోపే భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు సమకాలీన అంశాలపై విస్తృత జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ గ్రామాలు, స్థానిక సమాజ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఆధునిక ప్రపంచానికి అవసరమైన సాంకేతిక, వృత్తి నైపుణ్యాలను అలవరచుకోవాలని కలెక్టర్ అన్నారు. అనంతరం వారం రోజుల కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహా సభ్యులు, కవి ముచ్చర్ల దినకర్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ కే. గీతాంజలి, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, కళాకారులు, అధ్యాపకులు, శాఖ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.




