Narayanpet: తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

Narayanpet: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఉపాధి హామీ పనులు పెంచాలని నారాయణపేట కలెక్టర్ సిహెచ్. ప్రియాంక ఆదేశించారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 12 Nov 2026 8:34 PM IST
Narayanpet
X

Narayanpet: తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

నారాయణపేట జిల్లా: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్లు, ప్రగతి, పీఎంఏవై-జి, ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సమీకరణ, జలసిరి, స్వచ్ఛ భారత్ మిషన్, కొత్త జాబ్ కార్డుల నమోదు, చేయూత పింఛన్లు, తాగునీటి సరఫరా, పురపాలక సంఘాల అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే సుమారు 45 నుంచి 50 శాతం లోటు వర్షపాతం నమోదైందని, గత ఏడాది సాధారణ వర్షపాతంతో పోల్చినా గణనీయమైన లోటు ఉందని తెలిపారు. ముఖ్యంగా అక్టోబర్ నెలలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే సుమారు 96 శాతం లోటు నమోదవడం ఆందోళనకరమన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వచ్చే వేసవిలో జిల్లాలోని ఏ గ్రామంలోనూ, ఏ పట్టణంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తాగునీటి సరఫరాపై పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా నీటి అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, నీటి సరఫరా సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన నిధులను కలెక్టరేట్ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అధికారులు సమస్యలను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ప్రజలు బిందెలతో రోడ్లపైకి వచ్చే పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులన్నింటినీ ప్రస్తుత నిబంధనల ప్రకారం పరిశీలించి, ప్రతి ఆవాసంలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజువారీగా ఎక్కడెక్కడ పనులు ప్రారంభమయ్యాయి, ఎంతమంది కూలీలు హాజరవుతున్నారు అనే వివరాలను ఎంపీడీవోలు సమీక్షించాలని సూచించారు.

కూలీల సంఖ్యను పెంచి, వలసలను నివారించేలా అధికారులు క్షేత్రస్థాయిలో చొరవ చూపాలన్నారు.అలాగే జలసిరి పనులకు సంబంధించి కొన్ని మండలాల్లో వారం రోజులుగా కొత్త పనుల ప్రారంభం, గ్రౌండింగ్, పూర్తిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంఏవై-జి పోర్టల్‌లో అర్హులైన లబ్ధిదారుల జాబ్ కార్డుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

చేయూత పింఛన్ల మంజూరులో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఆమోదించాలని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల మొదటి దశ నిర్మాణాల పూర్తిలో జిల్లా వెనుకబడకుండా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. గృహ నిర్మాణాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోకుండా లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. రెండవ దశ ఇందిరమ్మ ఇండ్ల ప్రతిపాదనల పరిశీలనను కూడా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన సేవలను అందించాలని, వచ్చే వారం నాటికి ప్రతి అంశంలోనూ స్పష్టమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. ప్రియాంక ఆదేశించారు.

ఈ సమావేశంలో డీఆర్డివో వెంకట్ రాములు, జెడ్పీ డిప్యూటీ సీ ఈ వో సుజాత, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్,మిషన్ భగీరథ ఈ ఈ శ్రీనివాస్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA