Narayanpet: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని పోలీస్ కొలువులు సాధించాలి!

Narayanpet: నారాయణపేటలో పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణలో భాగంగా ఎస్పీ డా. వినీత్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 24 Nov 2026 11:26 AM IST
Narayanpet
X

Narayanpet: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని పోలీస్ కొలువులు సాధించాలి!

Narayanpet: నారాయణపేట జిల్లా పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ డా.వినీత్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులు క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలనతో నిరంతరం చదవాలని సూచించారు. పోలీస్ శాఖ కల్పిస్తున్న ఉచిత శిక్షణ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని రాత పరీక్షలతో పాటు ఫిజికల్ ఈవెంట్స్‌లోనూ ప్రతిభ కనబరచాలని తెలిపారు.

నారాయణపేట ఇక వెనుకబడిన జిల్లా అనే పేరు ఉండకూడదు. ఇక్కడి నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమై పోలీస్ ఉద్యోగాలు సాధించి జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులందరూ ఉద్యోగాలు సాధించి తిరిగి నారాయణపేట జిల్లాకే రావాలని, ఉద్యోగాలు పొందిన తర్వాత తమ గ్రామాలు, మండలాల్లోని ఇతర యువతకు స్ఫూర్తిగా నిలిచి వారిని కూడా ఉద్యోగాల వైపు ప్రోత్సహించాలని కోరారు.

ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులు శిక్షణ నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ వరకు శిక్షణ కొనసాగించాలని ఎస్పీని కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించి శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రిలిమ్స్ అనంతరం నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్‌లోనూ రాణించినప్పుడే పోలీస్ ఉద్యోగం సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహణకు కృషి చేసిన డీసీఆర్బీ డీఎస్పీ మహేష్, నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు, ఎస్ఐలు, అధ్యాపకులను ఎస్పీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీలు దైనంపల్లి ప్రవీణ్, బానోతు శ్రీనికేష్ నాయక్, పూజారి అనురాగ్, సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఫ్యాకల్టీ ఇన్‌చార్జి చారి, అధ్యాపకులు, శిక్షణ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA