Kalwakurthy: విద్యార్థి దశ నుంచే చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలి!
Kalwakurthy: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ అవగాహన సదస్సు.
Kalwakurthy: విద్యార్థి దశ నుంచే చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలి!
Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో విద్యార్థి దశ నుంచే బాలబాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కల్వకుర్తి సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ముదిగొండ రాజు అన్నారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కల్వకుర్తిలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి ముదిగొండ రాజు మాట్లాడుతూ.. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వారికి సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి పరిరక్షించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో పాటు తమ భద్రతపై కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించాలని, ఎవరైనా అసభ్యంగా లేదా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు.
విద్యార్థుల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే పోక్సో చట్టం-2012 ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉందని వివరించారు. తల్లిదండ్రులు చిన్నారులకు మొబైల్ ఫోన్లు ఇవ్వడంలో జాగ్రత్త వహించాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో ఆటలకు అలవాటు పడటం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని, ఫోన్లకు బానిసలయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అంతే కాకుండా సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక వివరాలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని దేశ భవిష్యత్తు విద్యార్థుల్లోని దాగి ఉందని వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి, ప్యానెల్ న్యాయవాదులు పి శివకుమార్, బి మల్లేష్ యాదవ్, బి ప్రశాంత్, కోర్టు సిబ్బంది కీర్తి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




