Maddimadugu: మద్దిమడుగులో రూ.100 కోట్లతో సంత్ సేవాలాల్ విగ్రహం: మంత్రి జూపల్లి!
Maddimadugu: మద్దిమడుగులో రూ.100 కోట్లతో సంత్ సేవాలాల్ విగ్రహం, రూ.20 కోట్లతో ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులకు 26న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు.
Maddimadugu: మద్దిమడుగులో రూ.100 కోట్లతో సంత్ సేవాలాల్ విగ్రహం: మంత్రి జూపల్లి!
Maddimadugu: మద్దిమడుగులో రూ.100 కోట్లతో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం... రూ.20 కోట్లతో ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధి... 26న సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన... అచ్చంపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం...
నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని పర్యాటక రంగంలో ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మద్దిమడుగు గ్రామాన్ని సందర్శించారు.
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణ శంకుస్థాపన, శ్రీ ఆంజనేయస్వామి దేవస్థాన అభివృద్ధి పనుల శంకుస్థాపన, బహిరంగ సభ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణం, రాకపోకల మార్గాలు, పార్కింగ్, మౌలిక సదుపాయాలు, భద్రతపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఉన్న లంబాడీ గిరిజన సమాజానికి ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు, బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మద్దిమడుగులో రూ.100 కోట్ల వ్యయంతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ భవనాన్ని కూడా నిర్మించనున్నట్లు, మొదటి విడతగా రూ.38 కోట్ల పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
ఈ నిర్మాణాలు పూర్తయితే మద్దిమడుగుకు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గుర్తింపు లభిస్తుందని, భక్తులు, గిరిజన ప్రజలు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారని, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.
మద్దిమడుగు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు, ఈ పనులకు 26న ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అచ్చంపేట పట్టణంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. మహిళల గౌరవం, ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని, గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ఏ ఒక్క పథకాన్ని నిలిపివేయకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు.
అత్యంత వెనుకబడిన అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ముఖ్యంగా రైతాంగానికి సాగునీటి సౌకర్యం కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తామని అన్నారు.
26న జరిగే బహిరంగ సభకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలతో పాటు దేవరకొండ నియోజకవర్గ ప్రజలు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
అనంతరం మంత్రి, ఎమ్మెల్యేలు మద్దిమడుగు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.




