Mahabubnagar: అధికారంలో ఉంటే ప్రగతి భవన్.. ప్రతిపక్షంలో ఉంటే ఫామ్‌హౌస్: యెన్నం!
Mahabubnagar: మహబూబ్‌నగర్ పట్టణంలో 67,300 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు చేశారు.
Mahabubnagar: అధికారంలో ఉంటే ప్రగతి భవన్.. ప్రతిపక్షంలో ఉంటే ఫామ్‌హౌస్: యెన్నం!
మహబూబ్‌నగర్: అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్‌కే పరిమితమైన కేసీఆర్ ... ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. గత మూడేళ్లుగా కేసీఆర్ ప్రజల మధ్యకు రావడం లేదని, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి * నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
పేదల సంక్షేమం, మహబూబ్‌నగర్ నగర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణం లోని సింహగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు పంపిణీ చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలకు 67,300 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 11 వేల రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో మరో 35 వేల మంది పేర్లను నమోదు చేశామని వివరించారు. ఇంకా అర్హులైన వారందరికీ దశలవారీగా రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
రైతులను సన్నవరి సాగు వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తోందని పేర్కొంటూ, రైతులు పండించిన సన్నధాన్యాన్ని సేకరించి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో సుమారు 8 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, పట్టణంలో దాదాపు 5 వేల ఇళ్లకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణంతో సిమెంట్, స్టీల్, ఇటుకలు, కంకర వ్యాపారులతో పాటు ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు.
అర్హులైన మహిళలకు పెన్షన్లు అందించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 2,600 పెన్షన్లు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇంకా అర్హత ఉండి పెన్షన్లు పొందని వారు ఉంటే వారికి కూడా దశలవారీగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉండి బస్తీలు, కాలనీలు, నగర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. గతంలో మాదిరిగా ఘర్షణలకు తావులేకుండా మహబూబ్‌నగర్‌లో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగిస్తూ ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. పిల్లలకు మెరుగైన విద్య, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పేదలకు ఆహారం, ఇళ్లు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
మహిళలకు గౌరవం, భద్రత కల్పిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ప్రజల ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, సిజే బెనహర్, మైత్రి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.




