Narayanpet: బీసీ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్.. 41 వాహనాలు సీజ్!

Narayanpet: నారాయణపేట పట్టణంలోని బీసీ కాలనీలో డీఎస్పీ నల్లపు లింగయ్య ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి, పత్రాలు లేని 41 వాహనాలను సీజ్ చేశారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 27 Oct 2026 1:52 PM IST
Narayanpet
X

Narayanpet: బీసీ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్.. 41 వాహనాలు సీజ్!

Narayanpet: జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు డీఎస్పీ నల్లపు లింగయ్య ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొని కాలనీలోని 180 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన వాహన పత్రాలు లేని 41 వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. వీటిలో 39 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు ఉన్నాయని వెల్లడించారు.

ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో పోలీసులు సమావేశమై నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందించి నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కాలనీలో దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం సులభమవుతుందని వివరించారు.

అలాగే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ... ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీస్ శాఖతో కలిసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ శివశంకర్, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, సతీష్ రెడ్డి, గాయత్రి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA