Pebberu: పెబ్బేరులో కేటీఆర్ పర్యటన వివాదం స్పష్టతనిచ్చిన రైతు వెంకటరాములు!

Pebberu: పెబ్బేరులో కేటీఆర్ పర్యటనపై చెలరేగిన వివాదంపై రైతు వెంకటరాములు స్పందిస్తూ తన మాటలను వక్రీకరించారని క్లారిటీ ఇచ్చారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 21 Sept 2026 7:07 PM IST
Pebberu
X

Pebberu: పెబ్బేరులో కేటీఆర్ పర్యటన వివాదం స్పష్టతనిచ్చిన రైతు వెంకటరాములు!

Pebberu: కేటీఆర్ పర్యటనతో పెబ్బేరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన కేటీఆర్‌ను అడ్డంగా రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కేటీఆర్ పర్యటనను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు చేసిన ‘శవరాజకీయాలు’ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో కేటీఆర్‌తో మాట్లాడిన గుమ్మడం గ్రామానికి చెందిన రైతు "వెంకటరాములు" స్వయంగా మీడియా ముందుకు వచ్చి తన మాటలను కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించారని స్పష్టం చేయడం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

“నేను కేటీఆర్‌ను వ్యతిరేకంగా మాట్లాడలేదు.. మా రైతుల గోడును చెప్పాను” అంటూ వెంకటరాములు వెల్లడించారు. సింగోటం రిజర్వాయర్, జూరాల ప్రాజెక్టు పరిధిలో నీరు ఉన్నప్పటికీ రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందడం లేదని, విద్యుత్ సరఫరా విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.

తన మాటలను కేటీఆర్‌ను నిలదీసినట్లుగా, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం బాధ కలిగించిందని వెంకటరాములు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను చెప్పడమే తన ఉద్దేశమని, రాజకీయ విమర్శలు చేయడం కాదని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ అంశంపై పెబ్బేరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ నాయకుల సమావేశం రాజకీయంగా మరింత వేడిని పెంచింది. కాంగ్రెస్ నాయకులు పూర్తి అవగాహన లేకుండా ప్రెస్‌మీట్లు పెడుతున్నారని, అసలు రైతుల సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతున్నారని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు.

మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేటీఆర్ వచ్చిన సందర్భాన్ని ‘శవరాజకీయాలు’గా అభివర్ణించడం సరికాదని, అదే సమయంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా స్థానిక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం తమ బాధ్యతగా భావించామని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.

ఇక ఈ మొత్తం వివాదంలో రాజకీయ ఆరోపణల కంటే రైతు వెంకటరాములు చెప్పిన సాగునీరు, విద్యుత్ సమస్యలే అసలు అంశంగా మారాయి. సింగోటం రిజర్వాయర్, జూరాల నీటి విడుదల, రైతులకు విద్యుత్ సరఫరా వంటి సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU