Pebberu: బీఫ్ విక్రయదారులు నిబంధనలు పాటించకుంటే సీజ్: చైర్మన్

Pebberu: పెబ్బేరు అంబేద్కర్‌నగర్‌లో వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, వ్యర్థాలను రోడ్లపై వేసే బీఫ్ దుకాణాలను సీజ్ చేస్తామని చైర్మన్ హెచ్చరించారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 21 Sept 2026 3:05 PM IST
Pebberu
X

Pebberu: బీఫ్ విక్రయదారులు నిబంధనలు పాటించకుంటే సీజ్: చైర్మన్

వనపర్తి జిల్లా: పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్‌ (1వ వార్డు)లో వీధికుక్కలు, బెడదను అరికట్టాలని కోరుతూ కాలనీవాసులు 1వ వార్డు కౌన్సిలర్ కరుణశ్రీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.

ఇటీవల వీధికుక్కలు ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయని కాలనీవాసులు తెలిపారు. కుక్కలతో పాటు పందుల బెడద కూడా ఎక్కువగా ఉందని, దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

కాలనీవాసుల ఫిర్యాదుపై స్పందించిన మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ABC Rules 2023 ప్రకారం త్వరలో ప్రత్యేక బృందాన్ని రప్పించి వీధికుక్కలకు స్టెరిలైజేషన్, రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా మున్సిపాలిటీ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అంబేడ్కర్ నగర్ ప్రాంతంలో బీఫ్ విక్రయాల నుంచి వెలువడే వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయడం వల్ల కూడా వీధికుక్కల బెడద పెరుగుతోందని ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీఫ్ విక్రయదారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వ్యర్థాలను బహిరంగంగా వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బీఫ్ విక్రయదారులు మున్సిపల్ నిబంధనలను అతిక్రమించి వ్యర్థాలను బహిరంగంగా వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు పాటించని బీఫ్ దుకాణాలను మూసివేస్తామని ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత దుకాణాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

1వ వార్డు కౌన్సిలర్ కరుణశ్రీ మాట్లాడుతూ గతంలో కాలనీలను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేవారని, ప్రస్తుతం తమ వార్డులో అభివృద్ధి పనులు సరిగా జరగడం లేదని ఆరోపించారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని తెలిపారు.

అంబేడ్కర్ నగర్‌లో కుక్కలు, పందుల బెడదతో పాటు పారిశుద్ధ్య సమస్యలను కూడా పరిష్కరించి కాలనీ ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించాలని కాలనీవాసులు కోరారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU