Nagarkurnool: అతి గారాబం, క్రమశిక్షణ లోపం.. తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలా?

Nagarkurnool: అచ్చంపేట నుంచి పిల్లల్లో క్రమశిక్షణ, అతి గారాబం, సెల్‌ఫోన్ ప్రభావంపై ప్రత్యేక విశ్లేషణ కథనం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యతపై చర్చ.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 23 Nov 2026 10:40 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: అతి గారాబం, క్రమశిక్షణ లోపం.. తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలా?

Nagarkurnool: నేటి విద్యా వ్యవస్థలో కాలానుగుణంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఉపాధ్యాయుడంటే విద్యార్థులకు గౌరవం, భయం, భక్తి ఉండేది. గురువు చెప్పిన మాటను తల్లిదండ్రులు కూడా గౌరవించేవారు.

విద్యార్థులు తప్పు చేస్తే ఇంట్లోనూ, పాఠశాలలోనూ మందలించి మంచి మార్గంలో నడిపించేవారు. కానీ నేటి పరిస్థితుల్లో కారణమేదైనా ఉపాధ్యాయులు పిల్లల తప్పులను కూడా నిలదీస్తే, ఉపాధ్యాయులపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పిల్లల్లో క్రమశిక్షణ, బాధ్యత, పెద్దల పట్ల గౌరవం వంటి విలువలు తగ్గుతున్నాయనే ఆందోళన నెలకొంది.

బెత్తం కాదు.. బాధ్యత ముఖ్యం!

విద్యార్థులను శారీరకంగా కొట్టడం, మానసికంగా వేధించడం సరైన పద్ధతి కాదు. విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్ 17 ప్రకారం పిల్లలపై శారీరక శిక్షలు, మానసిక వేధింపులు నిషేధించబడ్డాయి. అయితే శిక్షలు నిషేధించబడ్డాయనే కారణంతో క్రమశిక్షణను పక్కన పెట్టకూడదు. కొట్టకుండా, అవమానించకుండా కూడా విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించే విధానాలను ఉపాధ్యాయులు అవలంబించాలి.

అతి గారాబం.. పిల్లల భవిష్యత్తుకు ప్రమాదకరం!

పిల్లలపై ప్రేమ చూపించడం తల్లిదండ్రుల బాధ్యతే. అయితే ఆ ప్రేమ హద్దులు దాటితే, పిల్లలు చేసే ప్రతి తప్పును సమర్థిస్తే వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. తప్పు చేసినా ప్రశ్నించకపోవడం, ఇతరులను అవమానించినా పట్టించుకోకపోవడం, ఎదుటివారి భావాలను గౌరవించకపోవడాన్ని చిన్న విషయాలుగా చూడడం సరైన పద్ధతి కాదు.

అతి గారాబం, సరైన పర్యవేక్షణ లేకపోవడం, కోపాన్ని నియంత్రించడంలో లోపాలు, హింసాత్మక ప్రవర్తనను ప్రోత్సహించే వాతావరణం వంటి అంశాలు నిర్లక్ష్యం చేస్తే కొంతమంది పిల్లల్లో తీవ్రమైన ప్రవర్తన సమస్యలు పెరిగే అవకాశం ఉంది. తోటి విద్యార్థులపై దాడులు చేయడం నుంచి ఉపాధ్యాయులను బెదిరించడం, తీవ్రమైన హింసాత్మక ఘటనలకు పాల్పడే స్థాయికి పరిస్థితులు చేరడం సమాజానికి కలవరపెడుతోంది. ఇలాంటి ఘటనల్లో ప్రాణనష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది.

పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వారిని వెనకేసుకురావడం కాకుండా, ఆ తప్పు వల్ల ఎదుటివారికి కలిగే నష్టాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. తమ పిల్లల భవిష్యత్తు కోసం చూపించే అతి గారాబం, ఇతరుల భవిష్యత్తు, భద్రతకు ముప్పుగా మారకూడదు. తల్లిదండ్రులు ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది.

సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావంపై అప్రమత్తత అవసరం

చిన్న వయసులోనే సెల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఆన్ లైన్ గేమ్స్ కు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల కొంతమంది పిల్లల్లో చదువుపై ఏకాగ్రత, సమస్యల పరిష్కార దృష్టి, నిర్ణయం, సమయపాలన దెబ్బతినే ప్రమాదం ఉంది.

హింసాత్మక కంటెంట్ ను అనుకరించడం, ఆన్ లైన్ లో ఇతరులను అవమానించడం వంటి ప్రవర్తనలను కూడా తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడటం, వారి ఆలోచనలు, స్నేహాలు, అలవాట్లను తెలుసుకోవడం అవసరం.

ఉపాధ్యాయులకు గౌరవం.. విద్యార్థులకు సరైన మార్గదర్శనం

విద్యాలయాలను సమాజ మార్పులో కీలకంగా చూడాలి. విద్యార్థులు తప్పు చేసినప్పుడు భయపడి వదిలేయకుండా, కొట్టకుండా, అవమానించకుండా ప్రేమతో అర్థమయ్యేలా చెప్పాలి. కౌన్సెలింగ్, అదనపు అభ్యాసం, తరగతి బాధ్యతలు, తల్లిదండ్రులతో సమన్వయం ద్వారా క్రమశిక్షణను పెంపొందించాలి.

విద్యార్థుల్లో ఇతరుల పట్ల గౌరవం, సహనం, కోపాన్ని నియంత్రించుకోవడం, సమస్యలను హింసకు తావులేకుండా పరిష్కరించుకోవడం వంటి లక్షణాలను పెంపొందించాలి. అదే విధంగా విద్యార్థుల్లో తరచూ కనిపించే దూకుడు, బెదిరింపులు, ఇతరులను హింసించే ప్రవర్తనలను చిన్నవిగా చూడకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి అవసరమైన కౌన్సెలింగ్ అందించాలి.

మార్పు తల్లిదండ్రుల నుంచే ప్రారంభం కావాలి..

పిల్లల భవిష్యత్తు కేవలం పాఠశాల బాధ్యత మాత్రమే కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సమన్వయంతో పనిచేసినప్పుడే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. పిల్లలకు మార్కులతో పాటు మానవత్వం, నిజాయితీ, క్రమశిక్షణ, పెద్దల పట్ల అవగాహన, మహిళల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత వంటి విలువలను నేర్పించాలి.

తప్పు చేస్తే మందలించడం ద్వేషం కాదు.. జీవితంలో సరైన మార్గాన్ని చూపించడం. పిల్లల ప్రతి కోరిక తీర్చడం కంటే, మంచి చెడులను గుర్తించే విచక్షణ నేర్పించడం తల్లిదండ్రుల అసలైన బాధ్యత. పిల్లల హక్కులతో పాటు వారి బాధ్యతలను కూడా గుర్తుచేయాలి.

నేటి పిల్లలే రేపటి పౌరులు. వారికి కేవలం ఉన్నత విద్య అందించే సరిపోదు.. మంచి వ్యక్తిత్వం, మానవత్వం, ఇతరుల ప్రాణాలకు విలువ ఇచ్చే సంస్కారం కూడా నేర్పించాలి. బెత్తంతో చెప్పాల్సిన అవసరం లేకుండా, మాటలతో నేర్పించగలిగే సంస్కారవంతమైన విద్యా వ్యవస్థను మనం తిరిగి తీసుకురావాల్సింది బెత్తాన్ని కాదు.

ఉపాధ్యాయుడికి గౌరవాన్ని, విద్యార్థుల్లో బాధ్యతను, తల్లిదండ్రుల్లో అవగాహనను, సమాజంలో మానవత్వాన్ని, అప్పుడే నేటి తరం రేపటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA