Narayanpet: పోక్సో చట్టంపై అవగాహన అవసరం నారాయణపేట ఎస్పీ

Narayanpet: నారాయణపేట జిల్లాలో పిల్లలపై లైంగిక నేరాల అరికట్టుకు పోక్సో చట్టంపై అవగాహన అవసరమని ఎస్పీ డా. వినీత్ సూచన; 112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 22 Nov 2026 8:50 PM IST
Narayanpet
X

Narayanpet: పోక్సో చట్టంపై అవగాహన అవసరం నారాయణపేట ఎస్పీ

నారాయణపేట: నారాయణపేట జిల్లా ...చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దాడులను అరికట్టి, వారికి రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ డా.వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు.

మరియు 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలబాలికలపై జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, అసభ్యంగా తాకడం, లైంగిక ఉద్దేశంతో అనుచితంగా ప్రవర్తించడం, అశ్లీల చిత్రాలు లేదా వీడియోలు చూపించడం వంటి నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టం అమలు లో ఉందని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని, పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాను చిన్న వయస్సు నుంచే వివరించాలని సూచించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అసభ్యంగా తాకినా, బెదిరించినా భయపడకుండా తల్లిదండ్రులకు లేదా నమ్మకమైన పెద్దలకు చెప్పేలా పిల్లలకు ధైర్యం కల్పించాలన్నారు. అపరిచితులు ఇచ్చే బహుమతులు, చాక్లెట్లు స్వీకరించకూడదని, ఎవరైనా రహస్యంగా ఉంచాలని ఒత్తిడి చేసినా వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు.

అదేవిధంగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా పరిచయమయ్యే అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు పంచుకోరాదని, అనుమానాస్పద సందేశాలు లేదా వేధింపులు ఎదురైతే వెంటనే పెద్దలకు తెలియజేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పిల్లలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునేలా భద్రమైన వాతావరణాన్ని కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఎక్కడైనా చిన్నారులపై లైంగిక వేధింపులు లేదా దాడులు జరుగుతున్నట్లు తెలిసినా, బాధితులు సహాయం కోరినా వెంటనే పోలీసులకు లేదా అత్యవసర పోలీస్ సహాయ నంబర్ 112కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.చిన్నారుల భద్రత మనందరి బాధ్యత – బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA