Narayanpet: గురుకులంలో విద్యార్థులకు అందని వసతులు.. కలెక్టర్‌కు వినతి!
Narayanpet: నారాయణపేట మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.
Narayanpet: గురుకులంలో విద్యార్థులకు అందని వసతులు.. కలెక్టర్‌కు వినతి!
నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన భోజనం, వసతి, ఇతర సౌకర్యాల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించాలని SFI నారాయణపేట జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా SFI నారాయణపేట జిల్లా అధ్యక్షులు భాను ప్రసాద్, జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో సగానికి పైగా విద్యార్థులు ప్రతిరోజూ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో అధికారులు పరిశీలించాలని కోరారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతి, భోజన సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి రావడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.అదేవిధంగా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అందించాల్సిన స్నాక్స్, ఇతర ఆహార పదార్థాలు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం కేటాయిస్తున్న నిధులు, సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందుతున్నాయా లేదా అనే విషయాలను అధికారులు తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల వాస్తవ హాజరు, ఆన్లైన్ అటెండెన్స్, ఆహార నిల్వలు, సరఫరా రికార్డులు, భోజన బిల్లులను పరిశీలించాలని, విద్యార్థుల నుంచి నేరుగా వివరాలు సేకరించాలని కోరారు. అలాగే పాఠశాలలో భోజనం నాణ్యత, తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి సౌకర్యాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వహణపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులు, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు SFI పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.




