Narayanpet: పండుగ సాయన్న స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం: మంత్రి శ్రీహరి!
Narayanpet: నారాయణపేట జిల్లా ముస్లాయిపల్లిలో పండుగ సాయన్న విగ్రహాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు.
Narayanpet: పండుగ సాయన్న స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం: మంత్రి శ్రీహరి
నారాయణపేట: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముస్లాయిపల్లిలో పండుగల సాయన్న విగ్రహావిష్కరణ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి* పేదల పక్షాన పోరాడిన ప్రజావీరుడు పండుగ సాయన్న స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం అని అన్నారు.
ముదిరాజ్‌లతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు పండగ సాయన్న అని అన్యాయాన్ని ఎదిరించి పేదల పక్షాన నిలిచి అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రజావీరుడు పండుగ సాయన్న జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర క్రీడా , పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
మక్తల్ మండలం ముస్లాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పండుగ సాయన్న ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
పేదల ఆకలి తీర్చిన ప్రజావీరుడు
పండుగ సాయన్న కేవలం ముదిరాజ్ సామాజిక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదని, పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిలిచిన ప్రజానాయకుడని మంత్రి పేర్కొన్నారు. ధనవంతులు, భూస్వాములు, పెత్తందారుల దోపిడీని ఎదిరించి వారి ఆధిపత్యానికి సవాల్ విసిరిన ధైర్యశాలి సాయన్న అని కొనియాడారు. ఉన్నవారి సంపదను పేదలకు పంచి, ఆకలితో అలమటించే నిరుపేదలకు అండగా నిలిచిన మహనీయుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. అందుకే ఆయనను ప్రజలు తెలంగాణ రాబిన్‌హుడ్‌గా గుర్తించారని అన్నారు.
నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాటం
పాలమూరు ప్రాంతానికి చెందిన పండుగ సాయన్న 19వ శతాబ్దంలో భూస్వామ్య దోపిడీ, సామాజిక అసమానతలు, అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ప్రజావీరుడిగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని మంత్రి గుర్తుచేశారు. పేదల హక్కుల కోసం నిలబడిన ఆయనను అణచివేయడానికి అప్పటి ఆధిపత్య శక్తులు కుట్రలు పన్ని నిజాం పాలనలో ఆయనకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.సాయన్న వీరగాథలు నేటికీ జానపద కళారూపాలు, ప్రజల కథల్లో సజీవంగా నిలిచి ఉన్నాయని తెలిపారు.
ముదిరాజ్ సామాజిక వర్గం ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. యువత విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, రాజకీయ చైతన్యంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు.
పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం గొప్ప విషయమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ముదిరాజ్ సామాజిక వర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహనీయుల చరిత్రకు గుర్తింపు ఇవ్వడం ద్వారా వారి త్యాగాలు, పోరాటాలు, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి భావితరాలకు చేరుతుందని పేర్కొన్నారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలన్న నిర్ణయం ఆయనకు దక్కిన సముచిత గౌరవమని అన్నారు.
పండుగ సాయన్న పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజంలోని పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముస్లాయిపల్లిలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్న మంత్రి, ఈ విగ్రహం గ్రామ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆయన చరిత్రను గుర్తుచేసే స్ఫూర్తి కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. మహనీయుల ఆశయాలను గౌరవిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.




