Nagarkurnool: విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర: ఎమ్మెల్యే!

Nagarkurnool: విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వెల్లడి. ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 19 Sept 2026 7:13 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర: ఎమ్మెల్యే!

Nagarkurnool: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధనతోపాటు వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

శనివారం నాగర్ కర్నూల్ పట్టణంలోని వెలుమ ఫంక్షన్ హాల్‌లో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమన్నారు. భాషల పరిరక్షణతోనే సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించగలమని తెలిపారు.

విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతోపాటు మంచి ఆలోచనా విధానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. హిందీ భాషపై విద్యార్థుల్లో ఆసక్తి, అభిరుచి పెరిగేలా బోధనా పద్ధతులను మరింత సరళంగా, ఆకర్షణీయంగా రూపొందించాలని అన్నారు. కేవలం మార్కుల సాధనకే విద్య పరిమితం కాకుండా బాధ్యతాయుతమైన, సామాజిక స్పృహ కలిగిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే విద్య లక్ష్యమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. ఉపాధ్యాయులు ప్రభుత్వానికి కొంత సమయం, సహకారం అందించాలని కోరారు. హిందీ భాష అభివృద్ధికి, విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తున్న హిందీ ఉపాధ్యాయులను అభినందించారు.

జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ మాట్లాడుతూ హిందీ భాష ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించడంతోపాటు దేశంలోని వివిధ భాషలు, సంస్కృతుల పట్ల గౌరవ భావన పెంపొందించేలా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లాలో పదో తరగతి హిందీ సబ్జెక్టులో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేసిన హిందీ ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని అన్నారు.

రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ హిందీ భాష అభివృద్ధితోపాటు విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల పెంపునకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. భాషా పండితులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

హిందీ సబ్జెక్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, డీఈఓ రమేష్ కుమార్ చేతుల మీదుగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, హమ్ హరూన్, ఎండి బురహన్, షాకిర్ పాషా, జహంగీర్, నాగేశ్వరరావు, రూప్ల నాయక్, సాజిద్, శ్రీనివాసులు, వెంకట రాజు, బసవయ్య, కురుమూర్తి, రాజు నాయక్, హిందీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL