Nagarkurnool: వట్టెం నవోదయకు 20 కంప్యూటర్లు మంజూరు చేసిన కలెక్టర్!

Nagarkurnool: వట్టెం నవోదయ విద్యాలయ అభివృద్ధికి పీఎం శ్రీ నిధులు నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఐఏఎస్ సమీక్ష పాఠశాలకు 20 కంప్యూటర్ల మంజూరు, ఐఐటీ కోచింగ్‌పై ఆదేశం.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 29 Sept 2026 10:39 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: వట్టెం నవోదయకు 20 కంప్యూటర్లు మంజూరు చేసిన కలెక్టర్!

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పాఠశాల సమగ్ర అభివృద్ధికి పీఎం శ్రీ పథకం కింద అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా సద్వినియోగం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సూచించారు.

మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధ్యక్షతన జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పీఎం శ్రీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వినియోగం తదితర అంశాలపై పాఠశాల ప్రిన్సిపల్ బి. పూర్ణిమను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ....., విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, వివిధ నైపుణ్యాలను పెంపొందించేలా పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని, పీఎం శ్రీ పథకం ద్వారా పాఠశాలకు అందుబాటులో ఉన్న నిధులను విద్యార్థులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.

విద్యార్థుల్లో సంగీతంపై ఆసక్తిని పెంపొందించేందుకు మ్యూజిక్ టీచర్ నియామక ప్రక్రియ పూర్తయిందా లేదా అనే అంశంపై ప్రిన్సిపల్‌ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు సంగీతం, కళలు, క్రీడలు తదితర రంగాల్లోనూ నైపుణ్యాలను పెంపొందించే అవకాశాలు కల్పించాలని సూచించారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక, చారిత్రక, ప్రకృతి అందాలకు సంబంధించిన ప్రదేశాలను జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు సందర్శించేలా అవసరమైన ఏర్పాట్లు కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

తరగతి గది విద్యతో పాటు జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి వైవిధ్యాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించడం ద్వారా వారి విజ్ఞాన పరిధిని విస్తరించవచ్చని, విద్యార్థుల విద్యాభ్యాసానికి సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పాఠశాలకు అవసరమైన 20 కంప్యూటర్లను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారు. కంప్యూటర్ విద్య ద్వారా విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించి, ఆధునిక విద్యా విధానాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలని సూచించారు.

పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యా వనరులు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

11వ, 12వ తరగతి విద్యార్థులకు ఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక బోధనా కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి వారికి అవసరమైన అదనపు బోధన, మార్గదర్శకత్వం అందించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

పాఠశాలలో విద్యార్థుల పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేలా తరగతుల వారీగా ఫలితాలను విశ్లేషించి, అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు విద్యా, సాంస్కృతిక, క్రీడా, సాంకేతిక కార్యక్రమాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

వచ్చే విద్యా సంవత్సరానికి 6వ, 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం కొనసాగుతున్న నమోదు ప్రక్రియపై కూడా జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ నెల 30వ తేదీ వరకు ఉన్న నమోదు గడువులోగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఖాళీ సీట్లు మిగలకుండా నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్, జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ బి. పూర్ణిమ, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు ఎస్. బాలాజీ నాయక్, డీఈ శిరీష్, డాక్టర్ సృజన, పేరెంట్స్ కమిటీ సభ్యులు రవికుమార్, ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL