Nagarkurnool: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అభివృద్ధిపై భట్టి సమీక్ష
Nagarkurnool: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్షించారు.
Nagarkurnool: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అభివృద్ధిపై భట్టి సమీక్ష
నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, అటవీ సంరక్షణ చర్యలు, వన్యప్రాణుల పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలపై అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి పోలీసు, అటవీశాఖ అధికారులు స్వాగతం పలికారు. నాగర్ కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర, అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ యశ్ ప్రకాష్ సింఘాల్, దోమలపెంట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేష్ తదితరులు ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న కార్యక్రమాలను వివరించారు.
అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని సహజ వనరులను కాపాడటంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అటవీ ప్రాంతంలో పర్యాటక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రకృతి అందాలను పర్యాటకులకు పరిచయం చేయడం, పర్యావరణ సమతుల్యతకు విఘాతం కలగకుండా ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించారు.
అటవీ సంపద, జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తూనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించే దిశగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రకృతి పరిరక్షణకు పెద్దపీట వేస్తూ అమ్రాబాద్ అటవీ ప్రాంతాన్ని పర్యాటక ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించారు




