Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 4 Nov 2026 5:08 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే!

Nagarkurnool: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి, జిల్లాలోని బీసీ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన పోటీ పరీక్షల శిక్షణ అందించాలని కోరుతూ డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో పాటు, జిల్లాలో బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారని వివరించారు. ప్రతి సంవత్సరం వందలాది మంది డిగ్రీ, పీజీ విద్యావంతులు టీజీపీఎస్సీ గ్రూప్స్, పోలీస్, డీఎస్సీ/టెట్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు.

జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక కోచింగ్ కేంద్రం లేకపోవడంతో పేద, మధ్యతరగతి బీసీ విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ కో టీవీసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలంటే నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు ఎంతో అవసరమని వివరించారు.

స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ప్రభుత్వ భవనం సిద్ధం

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయాల సముదాయంలో, ఆర్టీఓ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఫస్ట్ బ్లాక్‌లో, జిల్లా ఫైర్ ఆఫీస్ పైన సుమారు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన ప్రభుత్వ భవనాన్ని గుర్తించినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ భవనంలో రెండు లెక్చర్ / స్టడీ హాళ్లు, నాలుగు గదులు, నాలుగు మరుగుదొడ్లు, నిరంతర నీటి సరఫరా, త్రీ ఫేజ్ విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శాశ్వత భవనం నిర్మించే వరకు ఈ భవనంలోనే తాత్కాలికంగా కోచింగ్ తరగతులు ప్రారంభించేందుకు అవకాశం ఉందని వివరించారు.

మంత్రికి విజ్ఞప్తి

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతన ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని, అవసరమైన నిధులు, బోధనా సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బీసీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేస్తే నాగర్‌కర్నూల్ జిల్లాలోని పేద, మధ్యతరగతి బీసీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, గ్రామీణ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మంచి అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL