Achampet: లెదర్ పార్క్‌ను వెంటనే పునఃప్రారంభించాలి: మల్లెల సుజాత!

Achampet: అచ్చంపేట బల్మూర్ మండలం జిన్‌కుంట వద్ద మూతపడిన లెదర్ పార్క్‌ను మల్లెల సుజాత పరిశీలించారు. 400 మంది చర్మకారుల ఉపాధి కోసం వెంటనే పార్క్‌ను తెరవాలని డిమాండ్ చేశారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 13 Oct 2026 9:43 PM IST
Achampet
X

Achampet: లెదర్ పార్క్‌ను వెంటనే పునఃప్రారంభించాలి: మల్లెల సుజాత!

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం జనాభా అత్యధికం. తరతరాలుగా చెప్పులు కుట్టడం, తోలు వస్తువులు తయారు చేయడం వారి కులవృత్తి. ఈ వృత్తిని నమ్ముకున్న వారికి ఆధునిక శిక్షణ ఇచ్చి, శాశ్వత ఉపాధి కల్పించి, ఆర్థికంగా నిలబెట్టాలనే గొప్ప లక్ష్యంతో గత ప్రభుత్వం బల్మూర్ మండలం జిన్ కుంట స్టేజీ (హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన) వద్ద లెదర్ పార్క్ (చెప్పుల తయారీ కేంద్రం) ను కోట్ల రూపాయలతో నిర్మించింది. కానీ నేడు ఆ పార్క్ తాళం వేసి, పాడుబడి, దుమ్ము కొట్టుకుపోయి కనిపిస్తోంది. 400 కుటుంబాల ఆశలు అడియాసలయ్యాయి.

అప్పట్లో సంబరం.. ఇప్పుడు స్మశాన నిశ్శబ్దం:

లెదర్ పార్క్ ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతంలోని సుమారు 400 మంది చర్మకారులు (మాదిగ యువకులు)* ఎంతో ఉత్సాహంతో LIDCAP (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ఆధ్వర్యంలో చెప్పుల తయారీ, డిజైనింగ్, కటింగ్, ఫినిషింగ్ లో నెలల తరబడి శిక్షణ తీసుకున్నారు. ఆధునిక మిషన్లు వచ్చాయి. ఇక మా బతుకులు మారుతాయి, మా చెప్పులకు మార్కెట్ లో గిరాకీ వస్తుంది" అని ఆశపడ్డారు.

కానీ శిక్షణ పూర్తయ్యాక అధికారుల పర్యవేక్షణ లోపం, పాలకుల నిర్లక్ష్యం, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం, ముడిసరుకు సరఫరాలో జాప్యంతో క్రమంగా పార్క్ మూతపడింది. యంత్రాలు తుప్పు పడుతున్నాయి. శిక్షణ పొందిన యువకులు ఉపాధి లేక హైదరాబాద్ కు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కొందరు మళ్ళీ పాత పద్ధతిలోనే రోడ్లపై చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు.

విజోస్ ఫౌండేషన్ పరిశీలన - మల్లెల సుజాత ఆగ్రహం:

మంగళవారం మూతపడిన లెదర్ పార్క్ ను విజోస్ ఫౌండేషన్ ఫౌండర్, సామాజికవేత్త మల్లెల సుజాత స్వయంగా పరిశీలించారు. పార్క్ లోని షెడ్లు, మిషన్లు, గోడౌన్ లను తిరిగి చూశారు. స్థానిక చర్మకారులతో మాట్లాడి వారి గోడు విన్నారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..

అచ్చంపేట లాంటి వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గంలో ఇలాంటి పార్క్ ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన. ఇక్కడ రవాణా సౌకర్యం (శ్రీశైలం హైవే), కరెంట్, నీళ్లు, షెడ్లు, వనరులు, సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి.కావాల్సింది కేవలం ప్రభుత్వ చిత్తశుద్ధి, కొంచెం చేయూత మాత్రమే. అధికారులు తలుచుకుంటే 24 గంటల్లో ఈ పార్క్ ను మళ్ళీ నడపవచ్చు" అని అన్నారు.

కేవలం చెప్పులే కాదు.. ఎన్నో తయారు చేయవచ్చు:

ఇక్కడ కేవలం సాధారణ చెప్పులు మాత్రమే కాదు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న లెదర్ బెల్టులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, కీ చైన్స్, వాహనాల లెదర్ సీట్ కవర్లు, జాకెట్లు, ఇండస్ట్రియల్ గ్లౌజులు* ఇలా 30 రకాలకు పైగా లెదర్ ఉత్పత్తులు తయారు చేసి ఆన్లైన్ లో, బయట మార్కెట్ లో అమ్ముకొని నెలకు రూ. 20 వేల నుండి 30 వేల వరకు సంపాదించవచ్చు. ఒక్కో కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది" అని సుజాత వివరించారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి: ఈ లెదర్ పార్క్ విషయాన్ని వెంటనే తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ (LIDCAP) చైర్మన్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఉన్నత అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే* దృష్టికి తీసుకెళ్తానని,బుధవారం అచ్చంపేట పర్యటన కు వస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వినతిపత్రం ఇచ్చి, పార్క్ పునఃప్రారంభానికి నిధులు మంజూరు చేయించేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

నియోజకవర్గంలోని చర్మకారులు, మాదిగ సంఘాల నాయకులు, యువకులంతా ఐక్యంగా ఈ పార్క్ ను వినియోగంలోకి తీసుకురావడానికి ముందుకు రావాలని, ఇది మన హక్కు అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక చర్మకారులు, విజన్ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజల మాట:"400 మందికి శిక్షణ ఇచ్చి పార్క్ మూసేయడం వల్ల మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మళ్ళీ తెరవాలి" అని స్థానిక చర్మకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA