Achampet: సంక్షేమ పథకాలపై చర్చకు నేను సిద్ధం: భట్టి విక్రమార్క!

Achampet: అచ్చంపేటలో రూ.74.82 కోట్ల పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.1,64,431 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశామని తెలిపారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 14 Oct 2026 5:18 PM IST
Achampet
X

Achampet: సంక్షేమ పథకాలపై చర్చకు నేను సిద్ధం: భట్టి విక్రమార్క!

అచ్చంపేట: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందని కుటుంబం లేదని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత మూడేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,64,431 కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని వెల్లడించారు. ఈ లెక్కలపై ఎవరితోనైనా చర్చించేందుకు, ఎలాంటి సవాల్‌నైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి రూపాయిని వారి అభివృద్ధి, సంక్షేమం కోసమే ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

‎నాగర్ కర్నూల్ జిల్లా ‎అచ్చంపేట నియోజకవర్గంలో 74.82 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అమ్రాబాద్ మండలం మన్ననూరులో 220/33 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు కేటాయించామని, జిల్లాల్లో అందుబాటులో ఉన్న సహజ వనరులు, నదులు, ఖనిజ సంపద, మానవ వనరుల ఆధారంగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతామని చెప్పారు. అచ్చంపేట ప్రాంతాన్ని ప్రధాన రవాణా కూడలిగా అభివృద్ధి చేయడంతో పాటు, పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.

‎‎ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు..

‎రాష్ట్రంలో కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా, కోటి ఆరు లక్షల కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనాలు అందుతున్నాయని భట్టి విక్రమార్క వివరించారు..పేదల ఆహార భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో కిలో సన్నబియ్యం ధర రూ.60 నుంచి రూ.70 వరకు ఉన్నప్పటికీ, పేదలకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.

దాదాపు కోటి ఆరు లక్షల కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. 43 లక్షల కుటుంబాలకు చేయూత పింఛన్లు అందిస్తున్నామని, 71.40 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్‌లో రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలోని 53 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. రైతు భరోసా, పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల ద్వారా అర్హులైన ప్రజలకు ప్రయోజనాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 76 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు.

ఏడు లక్షల మంది పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. కేవలం అచ్చంపేట నియోజకవర్గంలోనే 7,300 ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ పేదలకు సొంతింటి కలను నిజం చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని, వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగిజావ ఇస్తున్నామని చెప్పారు. కళాశాలల్లో చదువుతున్న సుమారు 12 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో, నవంబర్ 19న ఇందిరమ్మ జయంతి సందర్భంగా కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి కుటుంబానికీ వర్తించేలా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్లడించారు..

‎రహదారులకు రూ.90 వేల కోట్లు

‎తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భారీగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, క్లస్టర్ డెవలప్‌మెంట్ వంటి ప్రాజెక్టులపై దృష్టి సారించామని వివరించారు.

రాష్ట్ర అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి, వాటికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. నదులు, ఖనిజ సంపద, వ్యవసాయం, పర్యాటకం, మానవ వనరులను సమర్థంగా వినియోగించుకొని జిల్లాలవారీగా ఆర్థిక ప్రగతిని సాధిస్తామని స్పష్టం చేశారు.

ఎకో టూరిజంతో స్థానికులకు ఉపాధి

‎అచ్చంపేట ప్రాంతంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, కృష్ణానదిపై వంతెనలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందుతున్నాయని తెలిపారు. వీటి ద్వారా అచ్చంపేటను ప్రధాన రవాణా కూడలిగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు.

‎మన్ననూరు, నల్లమల అటవీ ప్రాంతాలకు ఉన్న సహజ సౌందర్యం, వన్యప్రాణుల సంపదను పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక గిరిజన కుటుంబాలు, రైతులు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్థానికంగా వసతి, ఆతిథ్యం, రవాణా, ఇతర సేవల ద్వారా కుటుంబాలకు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలను గుర్తించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు, నిధులు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA