Alampur: జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి వాకిటి శ్రీహరి!

Alampur: అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు. కరువు ముప్పు నుండి ప్రజలను కాపాడాలని ప్రార్థన.

B. NARENDER, MAKTHAL
Published on: 16 Oct 2026 12:55 PM IST
Alampur
X

Alampur: జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి వాకిటి శ్రీహరి!

Alampur: దసరా శరన్నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శక్తిపీఠం అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రిదంపతులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.

ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఈ సందర్బంగా మంత్రి మీడియా తో మాట్లాడుతూ జగన్మాత జోగులాంబ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం తనకు లభించిన గొప్ప ఆధ్యాత్మిక భాగ్యమని అన్నారు. ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాన్ని, దేశాన్ని కరువు ముప్పు నుంచి కాపాడాలని జోగులాంబ అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని, భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం సజావుగా సాగాలని, రైతుల కష్టాలు తొలగి ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ప్రకృతి అనుకూలించి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL