Makthal: గురజాల బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి

Makthal: కృష్ణ మండలం గురజాలలో రూ.2.40 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే ధ్యేయమని వెల్లడి.

B. NARENDER, MAKTHAL
Published on: 7 Nov 2026 5:46 PM IST
Makthal
X

Makthal: గురజాల బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్: మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం గురజాల గ్రామం రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలని, ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రజాప్రతినిధుల బాధ్యతని స్పష్టం చేశారు.

మక్తల్ నియోజకవర్గంలోని గురజాల గ్రామంలో కృష్ణ నుంచి గురజాల వరకు సుమారు రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో గురజాల గ్రామానికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే గ్రామంలో అడుగుపెడతానని హామీ ఇచ్చానని, ఆ మాట ప్రకారం కేవలం 14 నెలల్లోనే రోడ్డు పనులను పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో గురజాల రోడ్డు పనులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

మక్తల్ నియోజకవర్గం చిన్న ప్రాంతమైనప్పటికీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నిధులు కేటాయించి పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుతాయని అన్నారు.

సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే తేడా లేకుండా పేదరికమే ప్రామాణికంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజలందరి ప్రభుత్వమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయించే నిధులు కూడా ప్రజలు చెల్లించే పన్నుల నుంచే వస్తాయని వివరించారు. రాష్ట్రాల హక్కులు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి మహనీయుల విగ్రహాల ఆవిష్కరణలు, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు చేయడం సమంజసం కాదని మంత్రి అన్నారు. మహనీయుల ఆశయాలను గౌరవిస్తూ, గ్రామాల అభివృద్ధి కోసం వ్యక్తిగత విభేదాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL