Amarachinta: 455 మందికి చేయూత పింఛన్ల పత్రాలు పంపిణీ చేసిన మంత్రి
Amarachinta: అమరచింత మండలంలో 455 మందికి కొత్త చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు.
Amarachinta: 455 మందికి చేయూత పింఛన్ల పత్రాలు పంపిణీ చేసిన మంత్రి
Amarachinta: మక్తల్ నియోజకవర్గం అమరచింత లో అర్హులైన ప్రతి పేదవాడికి పార్టీలు, కుల మతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అమరచింత మండలంలో కొత్తగా మంజూరైన 455 చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదని, పేదలకు కొత్త ఇళ్లు సైతం మంజూరు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతీ పేదవాడికి పార్టీలు, కుల మతాలు చూడకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు.
మహిళలు మౌనంగా ఉండకుండా వాస్తవాలను తెలుసుకొని నిర్భయంగా మాట్లాడాలని సూచించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకుల నిర్వహణ, ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ వంటి అవకాశాలను కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు . కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కులను మహిళలకే అందిస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని, మహిళా సంఘాలు కోరిన వెంటనే 20 లక్షల వరకు రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరవుతున్నాయని తెలిపారు. మహిళలు అన్ని విషయాలపై అవగాహన పెంచుకొని, తప్పుడు ప్రచారాలను ధైర్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కరువు పరిస్థితుల్లోనూ పేదలకు రేషన్ షాపుల ద్వారా ప్రతి నెలా ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
మక్తల్ నియోజకవర్గంలో గతంలోనూ, ప్రస్తుతం కూడా గ్రామీణ రహదారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఇల్లు, వాడ, గ్రామం అభివృద్ధి చెందితే రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
అమరచింత పట్టణం రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసిన తర్వాతే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని మంత్రి స్పష్టం చేశారు.
బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులతో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సైతం పింఛన్లు అందిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధిని జోడేద్దుల్లాగా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.




