Maktal: మక్తల్ రామ్లీలా మైదానంలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
Maktal: మక్తల్ రామ్లీలా మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు మహిళలతో కలిసి ఆటపాటల్లో పాల్గొన్నారు.
Maktal: మక్తల్ రామ్లీలా మైదానంలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
Maktal: మక్తల్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల మధ్య మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ....
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, ప్రకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. పూల పండుగగా ప్రసిద్ధి చెందిన బతుకమ్మ మన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
మక్తల్ పట్టణంలో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకోవడం మంచి సంప్రదాయమని మంత్రి పేర్కొన్నారు. దసరా సందర్భంగా రావణ దహన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పాటు, బతుకమ్మ వేడుకల్లోనూ అదే స్థాయిలో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పండుగలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తూ ప్రజల మధ్య ఆత్మీయ అనుబంధాలను బలోపేతం చేస్తాయని తెలిపారు.
తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. మక్తల్లో పండుగలు ఐక్యతకు, సామరస్యానికి వేదికలుగా నిలవడం అభినందనీయమని మంత్రి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు, వైస్ ఛైర్ పర్సన్ శైవీ రెడ్డి, కౌన్సిలర్లు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.




