Devarakadra: దేవరకద్ర బ్రహ్మోస్ ప్రాజెక్టుపై భారీ ముందడుగు.. చెక్కుల పంపిణీ
Devarakadra: దేవరకద్ర బ్రహ్మోస్ ప్రాజెక్టు భూనిర్వాసితులైన 89 మంది రైతులకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున రూ.32.46 కోట్ల పరిహారం చెక్కులను ఎమ్మెల్యే జియంఆర్ పంపిణీ చేశారు.
Devarakadra: దేవరకద్ర బ్రహ్మోస్ ప్రాజెక్టుపై భారీ ముందడుగు.. చెక్కుల పంపిణీ
దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న బస్వాయిపల్లి, జీనుగురాల, చౌదర్పల్లి గ్రామాలకు చెందిన రైతులకు నష్టపరిహారం చెక్కులను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. బ్రహ్మోస్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు 14 లక్షల 50 వేల రూపాయల పరిహారం మాత్రమే వచ్చే పరిస్థితి ఉండగా, రైతుల విజ్ఞప్తి మేరకు వారికి మెరుగైన పరిహారం అందించాలని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కొడంగల్‌లో భూసేకరణకు ఎకరాకు 20 లక్షలు చెల్లించిన విధంగానే దేవరకద్రలో కూడా ఎకరాకు 20 లక్షలు పరిహారం అందించాలని తాను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయగా, వారు వెంటనే స్పందించి ఎకరాకు 20 లక్షల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించారని తెలిపారు.
అదేవిధంగా తెలంగాణలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తమ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవ మరియు దేవరకద్ర ప్రాంతంలోని అనుకూల పరిస్థితులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం–కేంద్ర రక్షణ శాఖతో తాము నిరంతరం చేసిన సంప్రదింపుల ఫలితంగా ఈ ప్రాజెక్టు మన ప్రాంతానికి వచ్చిందని ఎమ్మెల్యే జియంఆర్ వివరించారు.
బ్రహ్మోస్ యూనిట్ ఏర్పాటు వల్ల వాటి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని తద్వారా నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, ఐటీ, పరిశోధన తదితర రంగాలతో పాటు రవాణా, హోటళ్లు తో పాటు మన ప్రాంతం కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు.
రక్షణ శాఖ అధికారులు ఇచ్చిన స్కెచ్ ప్రకారం మూడు గ్రామాల పరిధిలో మొత్తం 416 ఎకరాల భూమి అవసరమని గుర్తించామని, ఇందులో 347 ఎకరాల ప్రైవేటు భూమి, 68 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు.
మిగిలిన రైతులకు సంబంధించిన పరిహారం కూడా అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి, త్వరలో వారికి కూడా పరిహారపు చెక్కులు అందజేస్తామని వెల్లడించారు. అలాగే పరిహారంతో పాటు రైతుల భూములలో బోర్లు, పైప్ లైన్లు ఉంటే వాటికి సైతం నష్టపరిహారం అందజేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.




