Devarakadra: వెంకటాయపల్లిలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ!
Devarakadra: దేవరకద్ర మండలం వెంకటాయపల్లిలో ఘనంగా గాంధీజీ విగ్రహావిష్కరణ పాల్గొన్న సర్పంచ్ రామాంజనేయులు, మాదారం కృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నివాళులు.
Devarakadra: వెంకటాయపల్లిలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ!
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సక్కెరి రామాంజనేయులు,మలక్‌పేట అగ్రికల్చర్ డైరెక్టర్,హైదరాబాద్ పాలమూరు కురుమ సంఘం అధ్యక్షులు మాదారం కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి,విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలను,స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... మహాత్మా గాంధీ సత్యం,అహింస అనే ఆయుధాలను నమ్ముకుని, శాంతియుత మార్గంలో స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపించిన మహానుభావుడని అన్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన గాంధీజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామాలు దేశ అభివృద్ధికి పునాదులాంటివని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని గాంధీజీ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.
గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి,పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం,పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలు చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. అలాగే గాంధీజీ చూపిన సత్యం,అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని,గ్రామంలో ఎదురయ్యే సమస్యలను పరస్పర చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
మహాత్మా గాంధీ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయడం ద్వారా ఆయన ఆశయాలు,సిద్ధాంతాలు భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండేలా చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భారతమ్మ, మాజీ సర్పంచ్ ఆంజనేయులు,మాజీ ఎంపీటీసీ జంగం పర్వతమ్మ,,షాకుల నారాయణ,ఉప సర్పంచ్ మోహన్,గ్రామ కురుమ సంఘం అధ్యక్షుడు శివ మరియు గ్రామ ప్రజలు యువకులు మహిళలు పాల్గొన్నారు.




