Mahabubnagar: ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు దుమారం!
Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ ప్రోగ్రెసివ్ థింకర్స్ ఆధ్వర్యంలో రేపు సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నారు.
Mahabubnagar: ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు దుమారం!
Mahabubnagar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్‌ఐఆర్ (SIR) పేరుతో లక్షలాది మంది ఓట్లను తొలగించడం తీవ్ర కలకలం రేపుతోంది! అతి చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమంటూ 'ప్రోగ్రెసివ్ థింకర్స్' ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి, దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. దీనికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలని ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో ప్రస్తుతం 1975 నాటి అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కంటే వంద రెట్లు దారుణమైన వాతావరణం నెలకొందని.. ప్రజలపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించడానికే ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఒక కుట్రలా అమలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ అన్యాయానికి వ్యతిరేకంగా, పౌర హక్కుల పరిరక్షణ కోసం రేపు 'సత్యాగ్రహ దీక్ష' చేపడుతున్నట్లు ప్రోగ్రెసివ్ థింకర్స్ నాయకులు వెల్లడించారు. ఈ దీక్ష వెనుక ఎలాంటి రాజకీయ పార్టీగానీ, రాజకీయ ప్రయోజనాలుగానీ లేవని.. కేవలం భారత పౌరుల ప్రాథమిక హక్కుల సాధన కోసమే ఈ పోరాటమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది బెక్కం జనార్దన్ రెడ్డితో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.




