Mahabubnagar: పిల్లల భవిష్యత్తు కోసం చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి

Mahabubnagar: మహబూబ్‌నగర్ బోయపల్లిలో రూ.25 లక్షలతో యాదవ భవన్ షెడ్‌కు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ; విద్యార్థులకు డిజిటల్ బోర్డు, పుస్తకాల హామీ.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 21 Nov 2026 5:41 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: పిల్లల భవిష్యత్తు కోసం చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ లోని 16వ డివిజన్ బోయపల్లిలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న యాదవ భవన్ షెడ్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి కుటుంబం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

తాను బోయపల్లి విద్యార్థుల కోసం డిజిటల్ బోర్డు, పుస్తకాలు అందిస్తానని, పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు స్థానికంగా ఒక ట్యూటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆస్తుల కంటే చదువు ఎన్నో రెట్లు గొప్పదని, విద్యే పిల్లలకు జీవితాంతం ఉపయోగపడే నిజమైన సంపద అని పేర్కొన్నారు. నగరానికి అతి సమీపంలో ఉన్న బోయపల్లి ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించాలని, ప్రతి ఇంట్లో విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

కేవలం డిగ్రీలు సంపాదించడమే కాకుండా, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏటీసీ (ATC) కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, ఆయా కేంద్రాల్లో నైపుణ్య శిక్షణ పొందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

గత ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, విషపు బీజాలు నాటిందని, మనుషుల మధ్యన విభేదాలు సృష్టించిందని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగా ఐఐఐటీ, ఇంజినీరింగ్ కళాశాలలు, లా కళాశాలల ఏర్పాటుతో పాటు విద్యాసంస్థలకు అవసరమైన ఇంటిగ్రేటెడ్ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.

విద్యావ్యవస్థ బలోపేతానికి, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పిల్లల విద్య, యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. బోయపల్లి ప్రజలు, నాయకులు అందించే ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్ మీరాబాయి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.