Mahabubnagar: అర్హులందరికీ సంక్షేమ పథకాలు - ప్రభుత్వ విప్ యెన్నం

Mahabubnagar: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2026 8:24 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: అర్హులందరికీ సంక్షేమ పథకాలు - ప్రభుత్వ విప్ యెన్నం

మహబూబ్ నగర్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని స్పష్టం చేశారు.

సోమవారం హన్వాడ మండలంలో నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ చేసి, మాట్లాడారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మొత్తం 3,600 పెన్షన్లు మంజూరయ్యాయని యెన్నం తెలిపారు.

హన్వాడ మండలానికి సుమారు 800 పెన్షన్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన దరఖాస్తులను త్వరలో పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ప్రయోజనం కలుగుతోందని ఆయన అన్నారు.

అర్హులైన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల నెలవారీ ఖర్చులు తగ్గుతున్నాయని తెలిపారు. మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు కుటుంబం కోసం కష్టపడుతుంటారని, వారి శ్రమను గుర్తించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందించడం వల్ల కుటుంబాల ఆహార ఖర్చుల భారం తగ్గుతోందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి కూలి పనులు చేసుకునే కార్మికులు రేషన్ సదుపాయం లేకపోతే అధిక ధరలకు బియ్యం కొనాల్సిన పరిస్థితి ఉంటుందని ఉదాహరణగా వివరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్